తమిళోడికి కర్ణాటకలో ఏం పని.. హీరో సిద్ధార్థ్ కు ఘోర అవమానం

అక్కడితో ఆగని ఆందోళనాకారలు.. అక్కడున్న విలేకరుల్ని తమిళ సినిమాల్ని ప్రోత్సహించొద్దని కోరటం గమనార్హం

Update: 2023-09-29 04:54 GMT

మోతాదు మించిన ప్రాంతీయతత్త్వాన్ని తప్పనిసరిగా ఖండించాల్సిందే. ఇలాంటి తీరు ఒక దేశంలోని వేర్వేరు ప్రాంతాల వారి మనోభావాల్ని దెబ్బ తీయటమే కాదు.. భారతీయతత్త్వాన్నే దెబ్బ తీసేలా ఉంటుందని చెప్పాలి. తన తాజా చిత్ర ప్రమోషన్ కోసం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు వెళ్లిన హీరో సిద్ధార్థ్ కు ఘోర అవమానం ఎదురైంది. ఆయన తాజాగా నటించిన చిత్రం చిత్తా (తెలుగులో దీన్ని చిన్నాగా చెప్పొచ్చు). ఈ మూవీ తమిళం.. కన్నడలో గురువారం విడుదలైంది.

ఈ మూవీ ప్రమోషన్స్ కోసం బెంగళూరులోని ఒక హోటల్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం జరుగుతున్న వేళ.. కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు ఎంట్రీ ఇచ్చి.. మీడియా మీట్ ను డిస్ట్రబ్ చేశారు. 'తమిళోడివి కర్ణాటకలో ఏం పని?' అంటూ నినాదాలు చేయటంతో పాటు.. ప్రెస్ మీట్ ను తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు.

అక్కడితో ఆగని ఆందోళనాకారలు.. అక్కడున్న విలేకరుల్ని తమిళ సినిమాల్ని ప్రోత్సహించొద్దని కోరటం గమనార్హం. రెండు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉండని. ఆ పేరుతో ఇలాంటి తీరు ఏ మాత్రం సరికాదు. ఇంటికి వచ్చినోళ్లు ఎవరైనా సరే.. ఆదరించాల్సిన అవసరం ఉందన్న చిన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిజానికి.. కళలు.. క్రీడలు రాజకీయాలకు.. భావోద్వేగాలకు కాస్తంత దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఒకే దేశానికి చెందిన రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయితీ.. రాష్ట్ర ప్రభుత్వాధినేతలు కూర్చొని ఉభయ ప్రజలకు నష్టం వాటిల్లకుండా నిర్ణయాన్ని తీసుకునేలా ప్రజలు ఒత్తిడి తేవాలి. అంతే తప్పించి.. తమిళనాడు ప్రాంతానికి చెందిన ఒకరు తమ రాష్ట్రానికి వస్తే.. 'తమిళోడివి బెంగళూరులో నీకేం పని' లాంటి మాటలు ఏ మాత్రం అంగీకారయోగ్యం కాదన్నది మర్చిపోకూడదు.

ఇంతకూ ఈ రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కావేరీ జల వివాదం విషయానికి వస్తే.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ..కర్ణాటక ప్రభుత్వాన్ని 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని పేర్కొంది. అందుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం కేవలం 5 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసింది. దీంతో.. తమిళనాడులో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు.. ఈ తీర్పును తప్పు పడుతూ కర్ణాటలోని కావేరీ జలాల పరిరక్షణ ప్రతినిధులు నిరసనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో సిద్దార్థ్ ప్రెస్ మీట్ కు వెళ్లిన ఆందోళనాకారులు.. ఆయన్ను అవమానించి.. ప్రెస్ మీట్ నుంచి బలవంతంగా బయటకు పంపేయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News