సినిమా థియేటర్లకు ఇది పెద్ద పోటే..
ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక ప్రభుత్వం మూవీ టికెట్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ పై రెండు శాతం పన్ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం సినిమాలను థియేటర్స్ లో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. మూవీ ఎంతో అద్భుతంగా ఉందనే టాక్ వస్తేనే తప్ప థియేటర్స్ కి వెళ్ళడం లేదు. ఎలాగో రెండు మూడు వారాలు ఆగితే ఓటీటీలో మూవీ రిలీజ్ అవుతుంది కదా అనే ధీమాతో ఉంటున్నారు. ఈ కారణంగా థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. స్టార్ హీరో సినిమా అయిన కూడా సూపర్ హిట్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధిస్తుంది. యావరేజ్ టాక్ వస్తే ఇక కమర్షియల్ ఫ్లాప్ అయినట్లే.
సినిమా బాగుంది అనే టాక్ వచ్చిన కూడా ఒక్కోసారి బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ రావడానికి చాలా సమయం పడుతుంది. చిన్న సినిమాలను అయితే ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితి అన్ని భాషలలో కూడా కనిపిస్తోంది. ఓటీటీలకి ఆదరణ విపరీతంగా పెరిగింది. ఇయర్ సబ్స్క్రిప్షన్ తో 2000-4000 మధ్యలో ఖర్చుపెడితే 3 నుంచి 4 ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఏడాది మొత్తం నచ్చిన సినిమా చూసుకోవచ్చు. భాషతో పరిమితం లేకుండా వినోదాన్ని ఆస్వాదించే అవకాశం లభిస్తోంది.
ఈ ఎఫెక్ట్ థియేటర్స్ పైన హెవీగా పడింది. ఇప్పటికే చాలాచోట్ల సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో మూత పడిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా కర్ణాటక ప్రభుత్వం మూవీ టికెట్స్, ఓటీటీ సబ్స్క్రిప్షన్ పై రెండు శాతం పన్ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకి చట్టసభల ఆమోదం కూడా లభించింది. గవర్నర్ సంతకం చేస్తే అఫీషియల్ గా అమల్లోకి వస్తుంది. అయితే ఈ నిర్ణయంపై సినీ పరిశ్రమ నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఇప్పటికే థియేటర్స్ లో సినిమాలు ఆడకపోవడంతో చిత్ర పరిశ్రమ సవాళ్ళని ఎదుర్కొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో టికెట్లపై పన్ను వేయడం సరైన నిర్ణయం కాదని కర్ణాటక ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఎన్ ఎం సురేష్ అభిప్రాయపడ్డారు. త్వరలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని కలిసి టికెట్స్ పని పన్నుకి సంబందించిన బిల్లుపై పునరాలోచన చేయాల్సిందిగా కోరుతామని అన్నారు.
కర్ణాటకలో 637 థియేటర్స్ ఉంటే అందులో 130 థియేటర్స్ మూతబడి స్థితిలో ఉన్నాయి. థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసిన కూడా అంతంత మాత్రమే ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా పన్ను విధిస్తే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్షియల్ గా మరింత నష్టపోతారని సురేష్ అంటున్నారు. ప్రభుత్వంతో ఈ బిల్లుపై చర్చిస్తామని నిర్మాతల మండలి నుంచి ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఒకవేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే థియేటర్స్ లలో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు సాహసం చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది. అదే జరిగితే పూర్తిగా థియేటర్స్ వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని చిత్ర పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. కన్నడ సినిమాని బ్రతికించుకునే క్రమంలో ఫైట్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవుతున్నారు.