కేసీఆర్ డైలాగ్.. డబుల్ ఇస్మార్ట్ పై ఊహించని గొడవ

పాట మధ్యలో "ఏం జేద్దామంటవ్ మరీ" అనే కేసీఆర్ పాపులర్ డైలాగ్ వాడటం వివాదానికి కారణమైంది.

Update: 2024-07-17 09:44 GMT

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ హడావుడి మొదలైంది. అయితే తాజాగా విడుదలైన రెండో లిరికల్ సాంగ్ మార్ ముంత చోడ్ చింత వివాదంలో చిక్కుకుంది. ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.

పాట మధ్యలో "ఏం జేద్దామంటవ్ మరీ" అనే కేసీఆర్ పాపులర్ డైలాగ్ వాడటం వివాదానికి కారణమైంది. ఇది కేసీఆర్ అభిమానులు మరియు తెలంగాణ వాదుల ఆగ్రహానికి గురవుతోంది. పాటలో ఈ డైలాగ్ వాడటం ద్వారా కేసీఆర్‌ను అవమానించారని, తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించారని విమర్శిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ సినిమా టైమ్ లో ఎలాంటి గొడవలు చూడని మేకర్స్ ఇప్పుడు ఊహించని విధంగా వివాదంలో చిక్కుకుంది.

ఈ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు పాట రచయిత కాసర్ల శ్యామ్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌పై కూడా విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ప్రాంతం వారుగా ఉన్నా, కేసీఆర్ డైలాగ్‌ను వాడటాన్ని ప్రోత్సహించడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. పాట విడుదలకు ముందు ఎడిట్ చేసే సమయంలో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం ఇప్పుడు వివాదానికి దారి తీసిందనే కామెంట్స్ వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో డబుల్ ఇస్మార్ట్ టీమ్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. తాము చేసిన తప్పును తెలుసుకుని, పాటలో మార్పులు చేస్తారా లేక వేరే ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వివాదం ఇంకా కొనసాగుతుందా లేక త్వరలోనే సద్దుమణుగుతుందా అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక డబుల్ ఇస్మార్ట్ సినిమా ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ పై ఛార్మి పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. పూరి ఈసారి డైలాగ్స్ తోనే కాకుండా మంచి యాక్షన్ డోస్ తో కూడా మెప్పించనున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి థియేటర్స్ లో డబుల్ ఇస్మార్ట్ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News