మొదలైన పెళ్లి హడావుడి..!

ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న స్నేహితులు కొద్ది మంది మాత్రమే. వారికే పెళ్లి ఆహ్వాన పత్రికలు అందాయని తెలుస్తోంది.

Update: 2024-12-04 17:30 GMT

మహానటి ఫేం కీర్తి సురేష్ పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెల్సిందే. దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి నెలకో వార్త అన్నట్లుగా సోషల్ మీడియాతో పాటు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాలోనూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ హీరోతో, ఈ సంగీత దర్శకుడితో, ఆ వ్యాపారవేత్తతో అంటూ కీర్తి సురేష్ పెళ్లి చాలా సార్లు సోషల్‌ మీడియాలోనే జరిగి పోయింది. ఎన్ని సార్లు కీర్తి సురేష్ చెప్పినా పెళ్లి వార్తలకు చెక్ పెట్టకుండా మీడియా వర్గాల వారు కంటిన్యూ చేస్తూనే వచ్చారు. తమిళ్‌ మీడియాలో వచ్చినట్లు తెలుగు మీడియాలో, మలయాళ మీడియాలో వచ్చినట్లు బాలీవుడ్‌ మీడియాలో కీర్తి సురేష్ పెళ్లి గురించి ముచ్చట్లు వినిపిస్తూనే వచ్చాయి.

ఎట్టకేలకు తానే స్వయంగా పెళ్లి చేసుకుంటున్నాను అంటూ ప్రకటించింది. ఇటీవల తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమయంలో కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్‌లో తాను పెళ్లి చేసుకోబోతున్నాను, గోవాలో తన పెళ్లి జరగనుంది అంటూ అధికారికంగా ప్రకటించింది. దాంతో ఆమె పెళ్లి విశేషాలు ఏంటి, ఇంతకు అతడు ఎవరు అంటూ రకరకాల ప్రశ్నలు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగాయి. చివరకు వ్యాపారవేత్త అయిన ఆంథోనీ అట్చిని కీర్తి సురేష్ వివాహం చేసుకోబోతుంది అంటూ అధికారికంగా ప్రకటన సైతం వచ్చింది.

గోవాలో డిసెంబర్‌ 12న జరగబోతున్న డెస్టినేషన్ వెడ్డింగ్‌కి అతిథులు సైతం ఫిక్స్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా కొద్ది మందిని మాత్రమే ఈ పెళ్లి వేడుకకి కీర్తి సురేష్ ఆహ్వానించిందని తెలుస్తోంది. మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు దత్‌ ఫ్యామిలీకి చెందిన వారిని ప్రియాంక దత్‌, స్వప్న దత్‌లను ఆహ్వానించిందని తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఆమెకు ఉన్న స్నేహితులు కొద్ది మంది మాత్రమే. వారికే పెళ్లి ఆహ్వాన పత్రికలు అందాయని తెలుస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రికలు ఇంకా పంపిణీ జరుగుతూనే ఉన్నాయని సమాచారం అందుతోంది.

మొత్తానికి కీర్తి సురేష్‌ వివాహ వేడుక వైభవంగా జరగబోతుంది. ఇప్పటికే ఫ్యామిలీ అండ్‌ ఫ్రెండ్స్ గోవాకి వెళ్లి పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టారు. మరో రెండు మూడు రోజుల్లోనే కీర్తి సురేష్ సైతం పెళ్లి హడావుడిలో జాయిన్‌ కాబోతుందని తెలుస్తోంది. పెళ్లి తేదీకి మూడు రోజుల ముందు నుంచే హల్దీతో వేడుక ప్రారంభం కాబోతుంది. కీర్తి సురేష్ కి ఉన్న క్రేజ్‌, ఆమె స్టార్‌డం నేపథ్యంలో పెళ్లిని ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తుందట. కానీ ఇప్పటి వరకు ఓటీటీ కి స్ట్రీమింగ్‌ రైట్స్ ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Tags:    

Similar News