జూనియర్ విరాట్ పుట్టాడు!
దీనిని అధికారికంగా ప్రకటించగానే ఈ అందమైన జంట అభిమానుల, ప్రజల నుంచి ప్రేమను పొందుతున్నారు
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ తమ రెండవ బిడ్డకు స్వాగతం పలికారు. ఫిబ్రవరి 15న మగబిడ్డను స్వాగతించినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించారు. అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో తమ కుమారుడికి `అకాయ్` అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ``సమృద్ధిగా ఆనందంతో మా హృదయాలు ప్రేమతో నిండిన దివ్య క్షణాన.. ఫిబ్రవరి 15న మేము మా అబ్బాయి అకాయ్ .. వామికాకు చిన్న సోదరుడిని ఈ ప్రపంచంలోకి స్వాగతించామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము! మా జీవితంలోని ఈ అందమైన సమయంలో మీ ఆశీర్వాదాలు శుభాకాంక్షలు కోరుకుంటున్నాము. ఈ సమయంలో దయచేసి మా గోప్యతను గౌరవించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము``అని రాసారు.
దీనిని అధికారికంగా ప్రకటించగానే ఈ అందమైన జంట అభిమానుల, ప్రజల నుంచి ప్రేమను పొందుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ `లవ్ లవ్ లవ్` అని మూడు ఈమోజీలతో విష్ చేసారు. అభినందనలు అని శ్వేతా బచ్చన్ నందా విషెస్ తెలిపారు. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
లండన్‌లో మరికొద్ది రోజుల్లో అనుష్క శర్మ తన బిడ్డకు జన్మనిస్తుందని గతంలో పుకార్లు వచ్చాయి. పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల తన X హ్యాండిల్ లో వ్యాఖ్యానిస్తూ.. మరికొద్ది రోజుల్లో ఒక బిడ్డ పుట్టబోతున్నాడని పేర్కొన్న తర్వాత ఇదంతా ప్రారంభమైంది. విరాట్ లేదా అనుష్క పేరు పెట్టకుండా, అతడు ఈ వార్తను ధృవీకరించాడు. మునుముందు కొద్ది రోజుల్లో కొత్త బిడ్డ పుట్టబోతోంది! ఈ పాప భారత్‌ను తన గొప్ప క్రికెట్ తండ్రిలా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని ఆశిస్తున్నాను. లేక తల్లిని ఫాలో అయి సినిమా స్టార్ అవుతుందా?`` అంటూ గోయెంకా రాసారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ , ‘టు బి బోర్న్ ఇన్ లండన్’ అనే హ్యాష్‌ట్యాగ్‌లను కూడా ఉపయోగించారు. దీంతో ఆ పారిశ్రామికవేత్త అనుష్క, విరాట్ గురించి మాట్లాడుతున్నారని అందరికీ స్పష్ఠత వచ్చింది.
అక్టోబర్ 2023లో అనుష్క శర్మ రెండవ గర్భం గురించి మీడియాలో కథనాలొచ్చాయి. అనుష్క తన రెండవ బిడ్డ కోసం ఎదురుచూస్తోంది అని ప్రముఖ మీడియా పోర్టల్ పేర్కొంది. తరువాత జనవరి 2024లో AB డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ``అవును... అతడి రెండవ బిడ్డ రాబోతోంది. అవును.. ఇది కుటుంబ సమయం.. ఇప్పుడు జరిగే విషయాలు అతడికి ముఖ్యమైనవి. చాలామంది ప్రజల ప్రాధాన్యత కుటుంబమని నేను భావిస్తున్నాను`` అని రాసాడు. ఆట ఆడాల్సిన సమయంలో అతడు టీమ్ తో లేకపోవడాన్ని ప్రజలు జడ్జ్ చేయకూడదని విరాట్ సరైన నిర్ణయం తీసుకున్నాడని డివిలియర్స్ సమర్థించాడు.
అనుష్క శర్మ డిసెంబర్ 2017లో విరాట్ కోహ్లిని పెళ్లాడింది. ఈ బ్యూటీ 2018లో తన చిత్రం జీరో విడుదలైన తర్వాత నటనకు విరామం తీసుకుంది. ఈ జంట జనవరి 2021లో వారి కుమార్తె వామికను స్వాగతించారు. అప్పటి నుండి అనుష్క ఏ సినిమాలోనూ నటించలేదు. తను నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చక్దా ఎక్స్‌ప్రెస్ త్వరలో విడుదల కావాల్సి ఉంది. అనుష్క ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసినప్పటికీ సినిమా విడుదల తేదీ ప్రస్తుతానికి తెలియదు.