2023లో కోలీవుడ్‌కి బ్యాడ్ నేమ్ తెచ్చిన వివాదాలు
చిన్న పెద్ద సినిమాలు విజయాలతో హుషారు పెంచినా కానీ వివాదాలు పెను విపత్తుగా మారాయి. 2023లో కోలీవుడ్ లో ముఖ్యమైన కొట్లాటలు .. మాటల యుద్ధం గురించి చూస్తే ఇదీ సంగతి.
కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టే సినీరంగంలో వివాదాలు కూడా పెద్దగానే ఉంటాయి. సోషల్ మీడియా డిజిటల్ యుగంలో కళారంగంలో ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే తెలిసిపోతోంది. ఈ సంవత్సరం కూడా వివాదాలకు కొరత లేదు. ముఖ్యంగా 2023 తమిళ సినిమా పురోగతికి సహకరించినా వివాదాలు చుట్టు ముట్టడంతో ఇండస్ట్రీ ప్రభ మసకబారింది. చిన్న పెద్ద సినిమాలు విజయాలతో హుషారు పెంచినా కానీ వివాదాలు పెను విపత్తుగా మారాయి. 2023లో కోలీవుడ్ లో ముఖ్యమైన కొట్లాటలు .. మాటల యుద్ధం గురించి చూస్తే ఇదీ సంగతి.
జాతీయ అవార్డ్ సినిమా 'పరుత్తివీరన్' దర్శకుడు అమీర్‌తో నిర్మాత కెఇ జ్ఞానవేల్ రాజా మధ్య చాలా కాలంగా వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమీర్ ఆరోపణల ప్రకారం.. సినిమా చిత్రీకరణ మధ్యలో ఉండగా, స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా 'పరుత్తివీరన్'ని పూర్తి చేయడానికి డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో దర్శకుడు అమీర్ స్వయంగా సినిమాని పూర్తి చేయడానికి అప్పు చేసి డబ్బు పెట్టాడు. దాంతో అమీర్ కొన్నేళ్ల క్రితమే సరైన నష్టపరిహారం, సినిమా హక్కులు కోరుతూ నిర్మాతపై కేసు పెట్టగా, దశాబ్ద కాలంగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది. జ్ఞానవేల్ తన వెర్షన్ చెబుతూ ఒక ఇంటర్వ్యూలో ప్రతిస్పందించాడు. జ్ఞానవేల్ వ్యాఖ్యలు తుఫాన్ సృష్టించాయి. సముద్రఖని, సుధా కొంగర, శశికుమార్ , నందా పెరియసామి తదితరులు జ్ఞానవేల్ కి వ్యతిరేకంగా అమీర్‌ను సమర్థించారు.
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ 'లియో' విడుదలైన తర్వాత, నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఒక ఇంటర్వ్యూలో తన సహనటి త్రిష గురించి కొన్ని విపరీతమైన వ్యాఖ్యలు చేశాడు. ''ఇకపై స్క్రీన్‌పై అత్యాచారం చేయడానికి వారు మమ్మల్ని అనుమతించరు. త్రిషతో కలిసి నటిస్తానని తెలియగానే బెడ్‌రూమ్ సన్నివేశాలు ఉంటాయని, ఆమెను బెడ్‌పైకి తోసేయవచ్చని అనుకున్నాను'' అంటూ వ్యాఖ్యానించాడు. త్రిష సోషల్ మీడియా పోస్ట్‌లో ఇకపై అతనితో కలిసి పని చేయనని చెప్పింది. లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్, ఖుష్బు, చిన్మయి, చిరంజీవి తదితరులు త్రిషకు సంఘీభావం తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, దక్షిణ భారత నడిగర్ సంఘం ఈ సమస్యను స్వీకరించినప్పుడు మన్సూర్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. దానిని త్రిష అంగీకరించారు.
ఈ సంవత్సరం AR రెహమాన్ మరక్కుమా నెంజమ్ కచేరీతో చెన్నైవాసులు మరపురాని అనుభూతిని పొందారు. అయితే వేదిక వద్ద నిర్వహణ సరిగా లేకపోవడంతో అదుపు తప్పింది. నిర్వాహకుల పక్షాన పేలవమైన నిర్వహణ సమస్య పెద్దదైంది. చాలా మంది అభిమానులు దాడికి దిగడం, టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ వేదిక వద్దకు ప్రవేశించలేకపోవడం వంటి చాలా ఇబ్బందులు ఈవెంట్ కి మచ్చ తెచ్చాయి.
క్యూలైన్లు రోడ్లపైకి వెళ్లాయి .. వేదిక వద్దకు చేరుకునే వారు తమ సీట్లు దొరక్క ఈవెంట్ చూడలేక వెనుదిరిగారు. అభిమానులు సానుభూతి పొందాలని ఆశిస్తూ సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేయగా, క్షమాపణ లేకుండా రెహమాన్ చేసిన ముందస్తు ట్వీట్లు అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేశాయి. టికెట్ డబ్బు వాపసు ఇస్తామని వాగ్దానం చేసినా కానీ 3 నెలల తర్వాత కూడా చాలా మందికి అందలేదు.
ముంబై సీబీఎఫ్‌సితో విశాల్ గొడవేంటో తెలిసిందే. 'మార్క్ ఆంటోని' హిందీ వెర్షన్ సర్టిఫికేషన్ కోసం ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని నటుడు విశాల్ ఆరోపించారు. మార్క్ ఆంటోని హిందీ వెర్షన్‌ను విడుదల చేయడానికి తాను మొత్తం రూ. 6.5 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించాడు. అతను మొత్తాలను బదిలీ చేసిన బ్యాంక్ ఖాతా వివరాలను జత చేశాడు. ఆరోపణను పరిగణనలోకి తీసుకున్న సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అంశంపై విచారించేందుకు సీనియర్ అధికారిని నియమించింది. ఈ కేసుపై ఇంకా తీర్పు వెలువడాల్సి ఉంది.
మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన 'మామన్నన్' ఆడియో ఆవిష్కరణ సందర్భంగా, దర్శకుడు 'తేవర్ మగన్' చిత్రం తనకు ఈ సినిమా చేయడానికి ఎలా ప్రేరణగా నిలిచిందో తెలిపారు. ఇలాంటి కథలో తన తండ్రి లాంటి పాత్ర ఏంటని తాను ఆశ్చర్యపోయానని, అదే మామన్నన్ అనే ఆలోచనను పుట్టించిందని అన్నారు. అతడు తేవర్ మగన్‌ని ఒక ముఖ్యమైన ఫిల్మ్ మేకింగ్ పాఠంగా పేర్కొన్నా..తప్పుడు ఉద్ధేశం లేకపోయినా కామెంట్ అర్థం చెడటంతో తమ ఫేవరెట్ సినిమాని అవమానించినట్టు కమల్ హాసన్ అభిమానులు భావించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమల్ హాసన్ సమక్షంలో ఈ వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో అభిమానులకు అంతగా నచ్చలేదు. కమల్ హాసన్‌కు తన ఉద్దేశ్యం ఏమిటో తెలుసు అని దర్శకుడి ఆ తర్వాత డిపెండ్ చేస్కున్నా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనిపై కమల్ మౌనంగా ఉండిపోయారు.