నంది అవార్డుల‌పై కోమటిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఇది పార్టీలు ప్రాంతాల‌కు అతీతంగా ఉంటుంద‌ని, ముఖ్య‌మంత్రితో ముచ్చ‌టించాక సినీపెద్ద‌ల‌ను కూడా ఆహ్వానించి మాట్లాడ‌తామ‌ని కోమ‌టిరెడ్డి అన్నారు.

Update: 2023-12-29 18:49 GMT

కొత్త సంవ‌త్స‌రంలో నంది అవార్డులిస్తామ‌ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఉగాది నాటికి నంది అవార్డులిచ్చేలా లైన్ క్లియ‌ర్ చేస్తామ‌ని, సినీప‌రిశ్ర‌మ‌ను సత్క‌రిస్తే త‌మ ప్ర‌భుత్వానికి మంచి పేరొస్తుంద‌ని కోమిటిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇది పార్టీలు ప్రాంతాల‌కు అతీతంగా ఉంటుంద‌ని, ముఖ్య‌మంత్రితో ముచ్చ‌టించాక సినీపెద్ద‌ల‌ను కూడా ఆహ్వానించి మాట్లాడ‌తామ‌ని కోమ‌టిరెడ్డి అన్నారు.


ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాలు దక్కగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహా 12 మంది మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రోడ్డు నిర్మాణం, సినిమాటోగ్రఫీ శాఖలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి కాదు. 2009లో రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్రీడలు, యువత, కమ్యూనికేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవులు, సహజవాయువు పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. తదనంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సమయంలో తన పదవికి రాజీనామా చేసి, నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదిగా మారారు.

గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి మంత్రివర్గంలోకి రావడంతో టాలీవుడ్‌కి ప్రభుత్వం నంది అవార్డులను ఇస్తుందా లేదా? అన్న చ‌ర్చా సాగింది. అయితే ఊహించ‌ని విధంగా కొత్త సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. సినీప‌రిశ్ర‌మ‌కు తాము వ్య‌తిరేకంగా లేమ‌ని సిగ్న‌ల్ ఇచ్చే ప్ర‌య‌త్న‌మే ఇద‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

అయితే సినీప‌రిశ్ర‌మ‌తో ముడిప‌డి ఉన్న డ్ర‌గ్స్ ఉచ్చును మాత్రం క‌నిపెట్టే ప్ర‌య‌త్నంలో ఉందీ ప్ర‌భుత్వం.

Tags:    

Similar News