కొరటాలకు చిరు మెసేజ్.. ఇప్పటికైనా క్లోజ్ అవుతుందా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేసిన విషయం తెలిసిందే. వరుసగా నాలుగు హిట్లు అందుకున్న కొరటాల.. ఆచార్యతో డిజాస్టర్ ను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో మూవీ రిజల్ట్ పక్కన పెడితే.. డిస్కషన్స్ ఎక్కువగా జరిగాయి. చిరు, కొరటాల మధ్య భారీగా మనస్పర్థలు వచ్చాయని.. సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత చిరంజీవి, కొరటాల వేర్వేరుగా పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు.. పెద్ద దుమారాన్ని రేపాయి.
వాస్తవానికి ఆచార్య మూవీ.. రామ్ చరణ్ చేయాల్సిందని, కానీ తానే తనతో తీయాలని కోరినట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవినే తెలిపారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మాట్లాడారు. సినిమా డైరెక్టర్స్ ఛాయిస్ అని, ఆయనేం చెబితే అదే చేశానని తెలిపారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో.. ఎవడి పని వాడు చేసుకుంటే అంతా బాగానే ఉంటుందని కొరటాల శివ వ్యాఖ్యానించారు.
దీంతో ఆయన చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్యలు చేశారని మీమ్స్ వచ్చాయి. ఇప్పుడు దేవర మూవీ రిలీజ్ నేపథ్యంలో ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో కొరటాల.. ఆచార్య మూవీ గురించి మాట్లాడారు. తాను ఆచార్య సినిమా రిజల్ట్ తర్వాత మానసికంగా కుంగిపోయానని తెలిపారు. ఆ సమయంలో కచ్ఛితంగా మంచి కమ్ బ్యాక్ ఇస్తావు శివ అని తనకు ఫస్ట్ మెసేజ్ చేసింది మెగాస్టార్ చిరంజీవినేనని చెప్పారు. కానీ కొన్ని ఇంటర్వ్యూల్లో ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కొరటాల అభిప్రాయపడ్డారు.
చిరంజీవితో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు కొరటాల శివ. బయట అనుకుంటున్నట్టుగా ఒక్క సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన తమ మధ్య పగలు, ప్రతీకారాలు లాంటివి అస్సలు ఏం లేవని చెప్పారు. అదంతా కొందరు సృష్టించుకున్నవి మాత్రమేనని తెలిపారు. చిరు ఏదో అన్నారని లేని దానిని హైలైట్ చేశారని తెలిపారు. అదే సమయంలో దేవర కథపై వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. బన్నీకి చెప్పిన స్టోరీ వేరని, దేవర స్టోరీ వేరని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ముఖ్యంగా.. ఆచార్య మూవీ తర్వాత కొందరు మెగాస్టార్ ఫ్యాన్స్ కు కొరటాల టార్గెట్ అయ్యారనే చెప్పాలి. ఆయన వల్ల తమ హీరోకు బిగ్ ఫ్లాప్ వచ్చిందని ఆరోపించారు. కొరటాలను చిరు బ్లేమ్ చేశాడని మరికొందరు సినీ ప్రియులు అనుకున్నారు. కానీ ఇప్పుడు కొరటాల.. చిరంజీవితో తనకు ఎలాంటి గొడవ లేదని తెలిపారు. మంచి రిలేషన్ ఉందని చెప్పారు. దీంతో ఇప్పుడు ఆచార్య సినిమా వివాదం చాలా వరకు క్లోజ్ అయినట్లే. మరి ఫ్యూచర్ లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.