అప్పటి హాస్యం తల్లిపాలు.. ఇప్పటి కామెడీ డబ్బాపాలు!
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కోట అంటే ఎంతో ప్రత్యేకమైన నటుడు. తనదైన విలక్షణ నటనతో తనకంటూ సినిమా చరిత్రలో కొన్ని పేజీలు రాసుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ప్రతి నాయకుడిగా..కమెడియన్ గా....సీరియస్ రోల్స్ ఇలా కోట పోషించిన పాత్ర అంటూ ఉండదు. ముఖ్యంగా విలనిజంలో కోట ఓ సంచలనం. విలన్ పాత్రలకు పెట్టింది పేరుగా కోట ఓ బ్రాండ్ గా వెలిగిన నటుడు.
ప్రస్తుతం వయోభారంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ కోట పేరు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కోట శ్రీనివాసరావు నాటి హాస్యాన్ని..మేటి హాస్యాన్ని తనదైన శైలిలో పోలిక చసారు. అదేంటో ఆయన మాటల్లోనే..`ఒకసారి నేను బాపు గారి సినిమాలో చేస్తున్నాను .. ఆ పక్కనే రమణగారు ఉన్నారు. నేను డైలాగ్ చెప్పలేక పోతున్నాను. నేను ఇబ్బందిపడుతుండటం చూసిన రమణగారు నన్ను పిలిచారు.
నాతో పాటు వచ్చి బాపుగారు కూడా అక్కడ కూర్చున్నారు. `ఈ బాపుగారు .. నేను .. నీ ఫ్యాన్సయ్యా ` అని రమణగారు అన్నారు. ఆ మాటకి నాకు ఒక్క సారిగా కళ్లంట నీళ్లు వచ్చాయి. ఆ తరువాత `పద్మశ్రీ` వచ్చినంత ఆనందమేసింది. ఆ తరువాత బాపు - రమణ గారి గురించి ఓ సందర్భంలో నన్ను మాట్లాడమంటే ఏం మాట్లాడను? తెలుగు చూడాలంటే బాపు .. తెలుగు వినాలంటే రమణగారు అన్నాను. ఎవరైనా .. ఎప్పుడైనా .. ఎక్కడైనా .. ఏ వయసులో ఉన్నవారైనా చెప్పుకుని నవ్వుకునేలా ఉండేది హాస్యం.
ఒకప్పుడున్నది హాస్యం. ఇప్పుడున్నది కామెడీ. ఆనాటి హాస్యం తల్లిపాలలాంటిది. ఇప్పుడున్న కామెడీ డబ్బాపాలవంటిది` అని అన్నారు. గతంలో కోట నేటి జనరేషన్ నటులు- పాత తరం నటుల మధ్య నటనా వ్యత్యాసాన్ని కూడా ఉద్దేశించి పోలిక చేసారు. ఓ రకంగా చెప్పాలంటే కోట రెండు తరాల మధ్య వ్యత్యాసాన్ని చెబుతూ చక్కని రివ్యూలా ఇస్తున్నారు.