టాలీవుడ్ కొత్త జంట.. సింపుల్ వేడుకతో ఒక్కటైన క్రిష్ - ప్రీతి..
ఇక ఫైనల్ గా నేడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాను ఇటీవల వివాహం చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. క్రిష్ వివాహం చేసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రేమ వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్లు టాక్ వచ్చింది. అందుకే షూటింగ్ కి కూడా కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ఫైనల్ గా నేడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రీతి చల్లాను ఇటీవల వివాహం చేసుకున్నారు.
ప్రీతి చల్లాకు రెండో వివాహం కాగా, క్రిష్‌కు కూడా ఇదే రెండో వివాహం. గతంలో ప్రీతి వివాహం చేసుకున్న కొన్నాళ్ళకు పలు కారణాల వల్ల ఆమె భర్తతో విడాకులు తీసుకుంది. ప్రీతికి కొడుకు కూడా ఉన్నాడు. క్రిష్ గతంలో రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, వారి మధ్య కూడా వివాహ సంబంధాలు సజావుగా లేకపోవడంతో 2018లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత క్రిష్ సింగిల్‌గా ఉన్నాడు.
ఇప్పుడు, ప్రీతి చల్లాతో మరో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వివాహం హైదరాబాద్‌లోని అత్యంత సన్నిహితుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. క్రిష్ సినిమా రంగంలో తన సత్తాను నిరూపించుకున్న దర్శకుల్లో ఒకరు. ఆయన మొదట్లోనే ‘గమ్యం’ చిత్రంతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకోవడంతో పాటు మంచి కమర్షియల్ సక్సెస్ కూడా సాధించింది.
ఆ తర్వాత ‘వేదం’, ‘కృష్ణం వందే జగద్గురుమ్’, ‘కంచె’, ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి విభిన్న జానర్స్ లో చిత్రాలను రూపొందించారు. పీరియాడిక్ డ్రామా నుంచి సాంఘిక విషయాలను పరిగణనలోకి తీసుకుని సామాజిక సమస్యలను చిత్రాల్లో ప్రతిబింబించారు. ప్రస్తుతం క్రిష్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో ‘ఘాటి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. ఆ టీజర్ ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది.
అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసిన ‘హరిహర వీరమల్లు’ అనే పీరియాడిక్ ప్రాజెక్ట్ కూడా మొదలుపెట్టారు కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుండి క్రిష్ మధ్యలోనే తప్పుకున్నారు. క్రిష్ వ్యక్తిగత జీవితంలో కూడా ఈ కొత్త ప్రయాణం ఆయన కెరీర్ లో కొత్త ఉత్సాహాన్ని తెచ్చే అవకాశం ఉంది. ప్రీతి చల్లాతో పెళ్లి చేసుకున్న సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు క్రిష్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక ఘాటీ సినిమాతో క్రిష్ తప్పనిసరిగా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇదివరకే బాలీవుడ్ లో మనికర్ణిక సినిమా నుంచి తప్పుకున్న క్రిష్ రీసెంట్ గా వీరమల్లు ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవడం కూడా అనుకోకుండా జరిగింది. ఇక అంతకుముందు ఎన్టీఆర్ బయోపిక్ డిజాస్టర్ అవ్వగా చివరగా వచ్చిన కొండపొలం కూడా డిజాస్టర్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఘాటీ సినిమాతో క్రిష్ హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలి.