మాలీవుడ్‌లో పని గంటలు చాలా ఎక్కువ: కృతి శెట్టి
జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్ కథానాయకుడు.
'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించింది కృతి శెట్టి. ఆ తర్వాత తెలుగు, తమిళంలో బిజీ నాయికగా మారింది. కానీ తానొకటి ఆశిస్తే అన్న చందంగా పరిస్థితి మారింది. ఈ భామకు కెరీర్ ని మలుపు తిప్పే పెద్ద విజయం దక్కలేదు. కానీ నటిగా సినిమా సినిమాకి కృతి పరిణతి చెందిన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ కన్నడ బ్యూటీ మాలీవుడ్ లో అడుగుపెడుతోంది. అజయంతే రందం మోషణం (ARM) అనే మలయాళ చిత్రంలో నటించింది. జితిన్ లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్ కథానాయకుడు. ఈ సినిమా కథ కథనం ఆసక్తికరం. మూడు ముఖ్యమైన కాలాలు -1900, 1950 మరియు 1990 లలో జరిగే కథాంశమిది. మూడు తరాల ప్రయాణాన్ని తెరపై చూపిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి ARM చిత్రంలో నటించేప్పుడు అనుభవాలు, సవాళ్ల గురించి వెల్లడించింది. అంతేకాదు మాలీవుడ్ లో పని గంటల (అదనపు పని) గురించి ప్రస్థావించింది కృతి. మలయాళ చిత్ర పరిశ్రమలో, ఇతర పరిశ్రమల కంటే పని గంటలు చాలా ఎక్కువ. కాబట్టి నా షెడ్యూల్ చాలా సుదీర్ఘంగా అనిపించింది. నాలుగో రోజుకే అంతా మారిపోయింది. సరిగా నిద్ర లేకపోవడంతో నా కనుబొమ్మలను కూడా నేను సరిగా ఉపయోగించలేకపోయాను.. ఆ సమయంలో అందరూ నన్ను అడిగారు.. అసలు ఏమైంది? మీరు బాగున్నారా? అని ప్రశ్నించారు. నేను నిద్రలేమి కారణంగా సరిగా పని చేయలేకపోయాను అని నేను గ్రహించలేకపోయాను. కానీ టోవినో నెలల తరబడి అలా పని చేస్తున్నాడు. అతడిలో ఉన్న శక్తి, నటుడిగా అంకితభావం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. అతడు అలసిపోయాడు అని ఎప్పుడూ కనిపెట్టలేకపోయాను. అతడు ఫిర్యాదు చేయడం నేను ఎప్పుడూ చూడలేదు. నిజానికి అతడు చాలా స్వీటెస్ట్ పర్సన్. అసలు కారవాన్‌లో కూర్చోవడానికి మాకు ఎక్కువ సమయం లభించేది కాదు.. అతడు రోజంతా అన్ని సమయాలలో పని చేస్తూనే ఉన్నాడు. చాలా శక్తివంతంగా ఉన్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు కూడా అతడు ఎనర్జిటిక్‌గా ఉన్నాడు. అతడు ఒకసారి నాతో మాట్లాడుతూ.. తన శక్తి వెనక రహస్యం బ్లాక్ కాఫీ -పవర్ నట్స్ అని నాకు చెప్పాడు. అయితే ఇది అతడి అంకితభావం అని నేను అనుకుంటున్నాను.. అని కృతి అంది.
ఎఆర్ఎం చిత్రంలో కృతి తన పాత్ర సంక్లిష్టత గురించి చెబుతూనే..టీమ్ వర్క్, హార్డ్ వర్క్ ను ప్రశంసించింది. ఈ సినిమా కథలో చాలా అంశాలు ఉన్నాయి. ఎదిగే క్రమంలో పురాణాలు, చరిత్ర ఆధారంగా ఎన్నో కథలు వింటుంటాం. ఇది నిజంగా ఆ రకమైన అనుభూతిని కలిగిస్తుంది. మూడు విభిన్న కాలాదుల్లో నడిచే కథాంశం. పౌరాణిక పాతకాలపు అంశాలతో కథ పరంగా నాణ్యతను కలిగి ఉంది. ఈ కథ వింటుంటే మనం అలాంటి జోన్‌లో ఉన్నామా? అనే భావనను కలిగిస్తుంది. ఈ కథ నన్ను నిజంగా ఉత్తేజపరిచింది. నేను కథ విన్న తర్వాత వారు నాకు ప్రీ-విజువలైజేషన్ బోర్డ్‌ను పంపారు. చిత్రీకరణ ప్రారంభానికి ముందు సృష్టించిన యానిమేటెడ్ వెర్షన్.
ఈ ఉత్తేజకరమైన సినిమా కోసం వారు ఇప్పటికే ఎంత కష్టపడి పనిచేశారో నాకు తెలుసు. నా ఇతర సినిమాలతో పోలిస్తే సినిమాలో నా స్క్రీన్ టైమ్ తక్కువని తెలిసినా.. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నాను. ఇది నిజంగా ప్రత్యేకమైన అనుభవం అని భావిస్తున్నాను. ఇందులో పాత కాలపు మలయాళ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను. చాలా పచ్చిగా కనిపించే ప్రామాణిక పల్లెటూరి అమ్మాయిగా నటించానని కృతి తెలిపింది. అలాగే మలయాళం నేర్చుకోవడం కఠినంగా ఉందని కూడా వెల్లడించింది.