హీరో సామ్యంపై సీనియర్ నటి అభిప్రాయం
దక్షిణాదిలో ఇప్పటికీ అలాంటి (పైన పేర్కొన్న) సినిమాలకు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు లేరని ఖుష్బు అభిప్రాయపడ్డారు.
ఖుష్బూ సుందర్ పరిచయం అవసరం లేదు. తమిళ హారర్ కామెడీ `అరణ్మనై 4`ని నిర్మించిన నటి-రాజకీయనాయకురాలు ఖుష్బు సుందర్ సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సౌత్ లో స్కోప్ అంతగా లేని కొన్ని విభిన్నమైన చిత్రాలను నిర్మించాలనుందని ఖుష్బూ అన్నారు. నిర్మాతగా డార్లింగ్స్, బదాయి హో , క్రూ వంటి కథలను అన్వేషించాలనుకుంటున్నట్టు తెలిపారు. తమన్నా భాటియా, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన అరణ్మనై 4 బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను రాబట్టింది. ఈ సందర్భంగా సక్సెస్ ప్రమోషన్స్ లో ఖుష్బూ మాట్లాడుతూ.. సౌత్‌లో ఇలాంటి సినిమాలకు స్కోప్ లేదని వ్యాఖ్యానించారు. తాను ప్రయోగాత్మక కథల్ని నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
దక్షిణాదిలో ఇప్పటికీ అలాంటి (పైన పేర్కొన్న) సినిమాలకు మల్టీప్లెక్స్ ప్రేక్షకులు లేరని ఖుష్బు అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో తాను అలాంటి కథలను అన్వేషించాలనుకుంటున్నానని.. వ్యాఖ్యానించారు. నేను మహిళా ప్రధాన చిత్రాలను మాత్రమే తీస్తానని చెప్పే నిర్మాతను కాదు. నేను డార్లింగ్స్, బధాయి హో, క్రూ లాంటివి చేయాలనుకుంటున్నాను. కానీ దురదృష్టవశాత్తూ దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ మనకు అలాంటి మల్టీప్లెక్స్ ప్రేక్షకులు లేరు... అని వ్యాఖ్యానించారు. ``అందుకు కొంత సమయం పడుతుంది. తమిళంలో బదాయి హో సినిమా వచ్చినప్పుడు పెద్ద ఫ్లాపైంది. ఇది బాగా ఆడలేదు అని తెలిపారు. అరణ్మనై 4కి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహించారు.
హిందీ చిత్రసీమ సహా తమిళం, తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఖుష్బూ నిర్మాతగా వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు. నిర్మాతగా తన సెన్సిబిలిటీస్ `చాలా కమర్షియల్` అని చెప్పారు. అయితే తన సినిమాలలో మహిళలకు ప్రాతినిధ్యం వహించే విధానం గురించి జాగ్రత్తగా ఉంటానని తెలిపారు. నిజానికి స్త్రీని చెడుగా చూపించాల్సిన అవసరం లేదు. అయితే ఒక స్త్రీ దుర్వినియోగ సంబంధాన్ని కలిగి ఉండటం జీవితంలో భాగమని చెప్పే స్క్రీన్‌ప్లేలను సమర్థించను. కాకపోతే కమర్షియల్ సినిమాలు చేయడం నాకు చాలా ఇష్టం. నేను చాలా సందేశాలు ఇచ్చే లేదా బోధించే సినిమాలు చేయడానికి ఇక్కడకు రాలేదు! అని ఖుష్బూ అన్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలు సినీ పరిశ్రమలో గడిపిన ఖుష్బు సుందర్, వాణిజ్యపరంగా లాభదాయకమైన ప్రాజెక్ట్‌లను నడిపించే మహిళలకు మద్దతు పెరగడాన్ని, ఇప్పటి మార్పును గమనించడం ఆనందంగా ఉందని అన్నారు. సినిమాల నిర్మాణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం హీరో పేరు మీద మాత్రమే సినిమాలు అమ్ముడవుతున్నాయని భావించే హీరోలు మనకు ఇప్పటికీ ఉన్నారు. సినిమాలో హీరోయిన్ చాలా చిన్న పాత్ర పోషిస్తుంది... అని కూడా అన్నారు. కానీ స్త్రీలు సినిమాని పూర్తిగా తమ భుజాల మీద మోస్తూ ఇంకా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఒక విజయవంతమైన చిత్రం కోసం మగ ప్రతిరూపంపై ఆధారపడవలసిన అవసరం లేదు. సినిమాకు మూలాధారం కంటెంట్.. ఆ మార్పు అద్భుతమైనదని భావిస్తున్నాను అని అన్నారు.
ఖుష్బు సుందర్ ప్రొడక్షన్ హౌస్ అవ్నీ సినిమాక్స్ , A C S అరుణ్ కుమార్ బెంజ్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఆరణ్మనై 4 హిందీ వెర్షన్ మే 31 న థియేటర్లలో విడుదల కానుంది.