లక్ష్మీపార్వతికి ఆహ్వానం దక్కకపోవడం వెనుక!

కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది

Update: 2023-08-28 05:18 GMT

విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు శతజయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం రూ.100 ప్రత్యేక నాణెంను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ లో ఆగస్టు 28న ఈ ప్రత్యేక నాణెంను ఆవిష్కరిస్తారు.

కాగా ఈ కార్యక్రమానికి సంబంధించి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆమె ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, మనుమళ్లు, మనవరాళ్లు ఇలా అందరికీ ఆహ్వానాలు పంపారు. అలాగే ఎన్టీఆర్‌ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన నేతలను కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో సహా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులంతా ఢిల్లీకి వెళ్లారని తెలుస్తోంది.

అయితే.. ఎన్టీఆర్‌ రెండో భార్య నందమూరి లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం అందలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు పురందేశ్వరి కానీ ఆమెను ఆహ్వానించలేదు. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు పొడిచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నారని వైసీపీ, తదితర పార్టీల విమర్శలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబును పురందేశ్వరి ఆహ్వానించడం విశేషం. అలాగే ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ను కూడా ఆహ్వానించారు.

కానీ ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతికి మాత్రం ఆహ్వానం దక్కకపోవడం గమనార్హం. లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్‌ తిరుపతిలో అధికారికంగా వివాహం చేసుకున్నారు. దీని ప్రకారం ఇప్పటికీ ఆమె ఎన్టీఆర్‌ భార్యే. అయినప్పటికీ అటు కేంద్రం కానీ, ఇటు పురందేశ్వరి కానీ లక్ష్మీపార్వతిని ఆహ్వానించలేదు.

నాణెం ఆవిష్కరణ కార్యక్రమం పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం. అలాంటప్పుడు ఎన్టీఆర్‌ కు సంబంధించి అందరినీ పిలవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అలా కాకుండా ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమో లేక నందమూరి, నారా వారి ఇళ్లల్లో ఫంక్షనో అయితే ఆమెను పిలిచినా, పిలవకపోయినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవంటున్నారు. అయితే ఎన్టీఆర్‌ పై ప్రత్యేక రూ.100 నాణెం ఆవిష్కరణ పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం కావడంతో ఆమెను ఆహ్వానించాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు తనకు ఆహ్వానం అందకపోవడంతో లక్ష్మీపార్వతి నేరుగా రాష్ట్రపతికి లేఖ రాశారు. తాను ఎన్టీఆర్‌ భార్యనని తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంతవరకు దీనిపై కేంద్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో లక్ష్మీపార్వతి ఈ కార్యక్రమానికి రాకూడదని కోరుకుంటున్న నందమూరి, నారా కుటుంబాల లక్ష్యం నెరవేరినట్టేనని అంటున్నారు.

Tags:    

Similar News