సంక్రాంతి నుంచి తప్పుకున్నా.. రవితేజకు పోటీనే..
ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ వంటి సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే
ఈ సంక్రాంతికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివ కార్తికేయన్ అయలాన్ వంటి సినిమాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. వీటితోపాటు ఐశ్వర్య రజనీకాంత్ తెరకెక్కించిన 'లాల్ సలాం' కూడా సంక్రాంతికి విడుదల కావాల్సింది. కానీ ఈ సంక్రాంతికి ఆగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టడం, టాలీవుడ్ లోనూ ఓ రేంజ్ లో పోటీ ఉండడంతో ఇలాంటి సమయంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మూవీ టీం వెనక్కి తగ్గింది.
దాంతో లాల్ సలాం ను సంక్రాంతి రేసు నుంచి తప్పించారు. ఇదే విషయాన్ని దర్శకురాలైన ఐశ్వర్య రజనీకాంత్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించగా తాజాగా మూవీకి సంబంధించిన న్యూ రిలీజ్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఈ సినిమాని ఫిబ్రవరి 9న విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. అయితే ఫిబ్రవరి 9న కేవలం తమిళంలోనే రిలీజ్ చేస్తారా? లేక ఒకేసారి తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
ఒకవేళ ఒకేరోజు అంటే ఫిబ్రవరి 9న తమిళ్ తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తే అదే ఫిబ్రవరి 9న మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' రిలీజ్ ఉంది. దాని ప్రకారం 'ఈగల్' తో 'లాల్ సలామ్' పోటీ పడే అవకాశం ఉంది. ఒకవేళ ముందుగా తమిళంలో రిలీజ్ చేసి అక్కడ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వారం తర్వాత తెలుగులో రిలీజ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి దీనిపై మూవీ టీం త్వరలోనే స్పష్టత ఇస్తుందేమో చూడాలి.
ముంబై బ్యాక్ డ్రాప్ లో క్రికెట్, రాజకీయాల చుట్టూ సాగనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మొదటిసారి మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రజనీకాంత్ తో పాటూ విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ కూడా ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.
చాలా గ్యాప్ తర్వాత రజనీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. జైలర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రజినీకాంత్ ఇందులో కీ రోల్ ప్లే చేస్తుండడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో కేఎస్ రవికుమార్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, వివేక్, ప్రసన్న, ధన్య బాలకృష్ణన్, విగ్నేష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.