కమల్ వల్ల నష్టపోయాం.. మాట తప్పాడు!
లోకనాయకుడు కమల్ హాసన్ మీద మరోసారి విమర్శలు గుప్పించాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లింగుస్వామి.
లోకనాయకుడు కమల్ హాసన్ మీద మరోసారి విమర్శలు గుప్పించాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ లింగుస్వామి. రన్, సెండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా) లాంటి చిత్రాలతో దర్శకుడిగా ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన లింగుస్వామి.. సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి కొన్ని చిత్రాలు ప్రొడ్యూస్ చేశాడు. అందులో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘ఉత్తమ విలన్’ ఒకటి.
విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం కల్ట్ మూవీగా పేరు తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఈ చిత్రంతో లింగుస్వామి భారీగా నష్టపోయాడు. ఈ సినిమా ఫెయిల్యూర్‌కు కమలే కారణమని గతంలో ఆరోపించాడు లింగుస్వామి. ఈ విషయమై ఇద్దరికీ గతంలో విభేదాలు కూడా నెలకొన్నాయి.
ఇప్పుడు ‘ఉత్తమ విలన్’ రిజల్ట్ గురించి మరోసారి స్పందించాడు లింగుస్వామి. ‘ఉత్తమ విలన్’ మంచి సినిమానే అయినప్పటికీ.. రష్ చూసుకున్నపుడు కొన్ని లోపాలు కనిపించాయని లింగుస్వామి చెప్పాడు. దీంతో తాను కొన్ని మార్పులు చేర్పులు చెప్పానని.. కానీ కమల్ వాటిని పట్టించుకోలేదని లింగుస్వామి తెలిపాడు.
ఈ సినిమా వల్ల తాము భారీగా నష్టపోయామని.. దీంతో ఆ నష్టాలను భర్తీ చేసేలా రూ.30 కోట్ల తక్కువ బడ్జెట్లో తమకు ఒక సినిమా చేస్తానని కమల్ హామీ ఇచ్చాడని.. అందుకోసం ఒక కథ కూడా చెప్పాడని.. కానీ ఆయన ఆ మాటను నెరవేర్చలేదని లింగుస్వామి విమర్శించాడు. చివరికి ‘దృశ్యం’ రీమేక్‌ను కమల్‌తో ప్రొడ్యూస్ చేయాలని తాము అనుకున్నామని.. కానీ దానికి అంగీకరించకుండా ఆ రీమేక్‌నే కమల్ వేరే సంస్థలో చేశారని లింగుస్వామి ఆవేదన వ్యక్తం చేశాడు.