'లియో 2' పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ
అయితే ఇలా విమర్శల పాలైన సినిమాకి సీక్వెల్ ఉంటుందా? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి.
కోలీవుడ్ పవర్ స్టార్ విజయ్ నటించిన `లియో` చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించినా కానీ, క్రిటికల్ గా ప్రశంసలు పొందలేకపోయింది. ఈ సినిమా స్క్రీన్ ప్లే పరంగా లోకేష్ కనగరాజ్ తప్పిదాలను దళపతి విజయ్ తండ్రి గారైన పాపులర్ డైరెక్టర్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖరన్ బయటపెట్టారు. సినిమా రిలీజ్ కి ఐదు రోజుల ముందే ప్రివ్యూ చూసిన ఆయన లోకేష్ కనగరాజ్ ని పిలిచి అతడు చేసిన తప్పిదాలపై విశ్లేషించగా, దానికి లోకేష్ అంగీకరించలేదని కూడా చంద్రశేఖరన్ బహిరంగ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈరోజుల్లో దర్శకులు తమ తప్పిదాలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరని చంద్రశేఖరన్ తీవ్రంగా విమర్శించారు.
అయితే ఇలా విమర్శల పాలైన సినిమాకి సీక్వెల్ ఉంటుందా? అన్న సందేహాలు చాలా మందికి ఉన్నాయి. కానీ కనగరాజ్ లో ఆశ చావలేదు. ఈ ప్రాజెక్టుకి సీక్వెల్ తీసే ఆలోచన ఉందని స్వయంగా వెల్లడించాడు. ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ కూలీ కోసం అతడు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి పని చేస్తున్నాడు గనుక పూర్తి ఎఫర్ట్ పెడుతున్నాడు. ఒకవేళ విజయ్ రాజకీయారంగేట్రం తర్వాత ఎప్పుడైనా అవకాశం కల్పిస్తే లియో 2 తీసేందుకు ఆస్కారం ఉందని చూఛాయగా కనగరాజ్ ధృవీకరించారు.
ఇటీవలి ఇంటర్వ్యూలో అతడు లియో పార్ట్ 2 అవకాశాల గురించి చర్చించాడు. దళపతి విజయ్‌తో లియో తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో లియో 2పైనా ఆశావహంగా ఉన్నానని తెలిపాడు. ఇటీవలే తన చివరి చిత్రం దళపతి 69ని దర్శకుడు హెచ్.వినోద్‌తో విజయ్ ప్రకటించారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే భవిష్యత్తులో అవకాశం ఇస్తే విజయ్‌తో `లియో 2` సినిమా చేస్తానని, దానికి పార్థిబన్ అనే టైటిల్ పెడతానని లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. లోకేష్ ఈ ప్రాజెక్టుతో ముందుకు వెళ్లాలని తంబీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే చివరికి విజయ్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవలసి ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి విజయ్ తన రాజకీయ జీవితంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. లియో 2 కార్యరూపం దాల్చుతుందో లేదో అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.