మూవీ రివ్యూ : మ్యాడ్ స్క్వేర్

'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
నటీనటులు: నార్నె నితిన్- సంగీత్ శోభన్- రామ్ నితిన్- విష్ణు ఓయ్- ప్రియాంక జవాల్కర్- మురళీధర్ గౌడ్- సునీల్- శుభలేఖ సుధాకర్- అనీష్ కురువిల్లా- సత్యం రాజేష్ తదితరులు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: శ్యామ్ దత్
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ-సాయి సౌజన్య
రచన-దర్శకత్వం: కళ్యాణ్ శంకర్
'మ్యాడ్' మూవీతో యువ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తింది చిత్ర బృందం. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తయారైంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె నితిన్-సంగీత్ శోభన్-రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన 'మ్యాడ్ స్క్వేర్' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి 'మ్యాడ్' లాగే ఇదీ ప్రేక్షకులను నవ్వించగలిగిందా? తెలుసుకుందాం పదండి.
కథ:
చదువు ముగించుకుని జీవితంలో సెటిలైన 'మ్యాడ్' గ్యాంగ్ మనోజ్ (రామ్ నితిన్).. అశోక్ (నార్నె నితిన్).. దామోదర్ (సంగీత్ శోభన్).. తమ ఫ్రెండ్ అయిన లడ్డు (విష్ణు ఓయ్) పెళ్లి చూడడం కోసం తన ఇంటికొస్తారు. కానీ కాసేపట్లో తాళి కట్టాల్సి ఉండగా 'మ్యాడ్' గ్యాంగుతో పాటుగా వచ్చిన అబ్బాయితో పెళ్లికూతురు వేరే అబ్బాయితో లేచిపోతుంది. దీంతో తన స్నేహితుల మీద కోపం పెంచుకుంటాడు లడ్డు. అతణ్ని కూల్ చేయడానికి ముందు హనీమూన్ ప్లాన్ చేసిన గోవాకే బయల్దేరుతుంది మ్యాడ్ గ్యాంగ్. కానీ అక్కడికి వెళ్లాక పెద్ద సమస్యలో చిక్కుకుంటారు. ఆ సమస్య ఏంటి.. దాన్నుంచి వాళ్లెలా బయటపడ్డారు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
తెలుగులో కామెడీ సినిమాలు చాలానే చూశాం కానీ.. 'మ్యాడ్' వాటిలో స్పెషల్. అందులో కథ అంటూ ఏమీ ఉండదు. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అంటూ ఏమీ కనిపించదు. కాలేజీలో గ్యాంగ్స్ మధ్య జస్ట్ ఏదో ఒక సిచువేషన్ క్రియేట్ చేయడం.. క్యారెక్టర్లను నిలబెట్టి పంచు డైలాగులు వేయించడం.. సినిమా అంతా ఇదే వరస. కానీ ఆ పంచులే భలేగా పేలుతూ వినోదాన్ని పంచాయి. హీరో హీరోయిన్లు ఆకర్షణీయంగా కనిపించారు.. పాత్రలకు తగ్గట్లు పెర్ఫామ్ చేశారు.. కాలేజ్ సెటప్ బాగా కుదిరింది.. మంచి పాటలూ తోడై సినిమా యువతను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ అంటే ఇంకా ఎక్కువ వినోదం ఆశించడం సహజం. ఈసారి కాలేజీలోనే కథను నడిపిస్తే మొనాటనస్ అవుతుందనేమో.. పెళ్లి-గోవా అంటూ సెటప్ మొత్తం మార్చారు. కానీ ఈ సెటప్ లో అనుకున్నంతగా వినోదం పండలేదు. 'మ్యాడ్'లో సహజంగా తన్నుకొచ్చిన వినోదం.. ఇక్కడ మాత్రం ఫోర్స్ట్ ఫీల్ కలిగిస్తుంది. 'మ్యాడ్'లో మాదిరి సరైన సిచువేషన్లు క్రియేట్ చేసి సహజంగా వినోదాన్ని పండించడంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఫెయిలయ్యాడు. అలా అని ఇందులో నవ్వులే పండలేదని కాదు.. కొన్ని సీన్లు బాగానే పేలాయి. కానీ 'మ్యాడ్'లో మాదిరి నాన్ స్టాప్ ఫన్ డోస్ మాత్రం ఇందులో లేదు.
'మ్యాడ్ స్క్వేర్' చాలా ప్రామిసింగ్ గానే మొదలవుతుంది. కాలేజీ జీవితం అయిపోయాక లడ్డు పెళ్లి కోసం 'మ్యాడ్' గ్యాంగ్ మళ్లీ కలవడంతో ఈ కథ మొదలవుతుంది. తన దోస్తులు వచ్చారని సంతోషించడం పోయి వీళ్లేం తలనొప్పి తెచ్చిపెడతారో అని లడ్డు కంగారు పడడం.. అందుకు తగ్గట్లే ముగ్గురు ఫ్రెండ్స్ నానా అల్లరి చేయడం.. ఇలా పెళ్లి ఇంట్లో సందడి సందడిగా సాగిపోతాయి సన్నివేశాలు. ముఖ్యంగా లడ్డు పెళ్లి ఆగిపోవడం.. తదనంతర పరిణామాలు కడుపుబ్బ నవ్విస్తాయి. చాలా సినిమాల్లో చూసిన కామెడీనే అయినా.. పెళ్లి ఆగిపోవడం గురించి అడగని వాళ్లకు కూడా చెప్పి ఫ్రెండును ఇబ్బంది పెట్టే నేపథ్యంలో కామెడీ హిలేరియస్ అనిపిస్తుంది. చివరికి గోవాలో ఫుడ్ డెలివరీ బాయ్ కి సైతం విషయం చెబితే అతను జాలిపడడం లాంటి సీన్లు ప్రేక్షకుల కడుపులు చెక్కలు చేస్తాయి. కథ పెళ్లి ఇంటి నుంచి గోవాకు మారిన కొంత సేపటి వరకు 'మ్యాడ్' సరదాగానే సాగిపోతుంది.
కానీ ఈ కథకు క్రైమ్ కామెడీ టచ్ ఇచ్చాకే 'మ్యాడ్' గాడి తప్పుతుంది. అనేక బాలీవుడ్ సినిమాలను తలపిస్తూ సాగే ఎపిసోడ్లలో కామెడీ పండలేదు. 'జాతిరత్నాలు' సినిమాను కూడా గుర్తు చేసే ద్వితీయార్ధం ప్రేక్షకులను అనుకున్నంతగా ఎంగేజ్ చేయలేకపోయింది. ఒక దశ దాటాక దర్శకుడి దగ్గర పంచులు అయిపోయాయేమో అనిపిస్తుంది. క్యారెక్టర్లన్నీ బాగా అలవాటు అయిపోయి.. ఎవరు ఏం మాట్లాడతారో.. దేనికి ఎలా రియాక్టవుతారో ముందే అంచనా వచ్చేస్తుంది. అందువల్లే కామెడీ పంచులు పేలలేదు. ద్వితీయార్దంలో కామెడీ పండించడానికి సరైన సిచువేషన్లు క్రియేట్ చేయలేకపోయారు. బ్రోతల్ హౌస్ లో కన్ఫ్యూజింగ్ కామెడీ పూర్తిగా తేలిపోయింది. మాఫియా డాన్ గా సునీల్ పాత్ర చుట్టూ కొన్ని సీన్లు మాత్రం నవ్విస్తాయి. సినిమా పూర్తిగా నాన్ సీరియస్ మోడ్ లో సాగుతుండడంతో క్రైమ్ ఎలిమెంట్ మీద ఆసక్తి కలగదు. ముగింపు సన్నివేశాలు పర్వాలేదు. ప్రథమార్ధంలో కామెడీ.. మంచి ఊపున్న పాటలు పడడం.. రెండు పాటల్లో ప్రియాంక జవాల్కర్-మోనికా రెబ్బాల అందచందాలు ప్లస్ పాయింట్స్. కానీ ఫస్ట్ పార్ట్ లో మాదిరి రొమాంటిక్ ట్రాక్స్ లేకపోవడం మైనస్. మొత్తంగా చూస్తే.. 'మ్యాడ్ స్క్వేర్' ఓ మోస్తరు వినోదంతో ఓకే అనిపిస్తుంది. కానీ 'మ్యాడ్' మాదిరి ఇందులో ఆర్గానిక్ కామెడీని చూడలేం. దాన్ని మించిన వినోదం అంటూ టీం పెంచిన అంచనాలను సీక్వెల్ అందుకోలేకపోయింది.
నటీనటులు:
'మ్యాడ్' గ్యాంగ్ మంచి ఎనర్జీతో నటించింది. ముఖ్యంగా సంగీత్ శోభన్ మరోసారి చెలరేగిపోయాడు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే తనలో మరింత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. తన కామెడీ టైమింగ్ భలేగా అనిపిస్తుంది. రామ్ నితిన్ సైతం హుషారుగా నటించాడు. నార్నె నితిన్ మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తాడు. ఈ ముగ్గురు హీరోల కంటే విష్ణు ఓయ్ కి ఎక్కువ మార్కులు పడతాయి. అతను ప్రతి సీన్లోనూ నవ్వించాడు. పెళ్లి చెడిపోయిన కుర్రాడిగా విష్ణును చూస్తేనే నవ్వొస్తుంది. తన తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ అదరగొట్టాడు. ఈ తండ్రీ కొడుకుల వినోదమే సినిమాకు మేజర్ హైలైట్. సునీల్ కామెడీ డాన్ పాత్రలో మెప్పించాడు. సత్యం రాజేష్.. అనీష్ కురువిల్లా.. వీళ్లంతా మామూలుగా అనిపిస్తారు.
సాంకేతిక వర్గం:
'మ్యాడ్ స్క్వేర్' టెక్నికల్ గా ఓకే అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో మంచి బీటున్న పాటలు అందించాడు. కానీ 'మ్యాడ్'లో 'నువ్వు నవ్వుకుంటూ..' తరహా వినసొంపైన పాట లేని లోటు కనిపిస్తుంది. తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ హుషారుగా సాగింది. శ్యామ్ దత్ ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ కలర్ ఫుల్ గా సాగాయి. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.. ఫస్ట్ పార్ట్ స్టయిల్లోనే సినిమాను బిందాస్ స్టయిల్లో నడిపించాలని చూశాడు. కొంత వరకు బాగానే నవ్వించగలిగాడు. 'మ్యాడ్'లో కాలేజీ నేపథ్యంలో ఫ్రెష్ సీన్స్ రాసిన అతను.. 'మ్యాడ్ స్క్వేర్'లో మాత్రం ఎన్నోసార్లు చూసిన కన్ఫ్యూజింగ్ క్రైమ్ కామెడీలను ఫాలో అయిపోయాడు. తన కామెడీ పెన్ను ఒక దశ దాటాక మొరాయించేసిన ఫీలింగ్ కలుగుతుంది.
చివరగా: మ్యాడ్ స్క్వేర్.. జస్ట్ ఓకే ఫన్
రేటింగ్-2.5/5