ఇదెక్కడి ట్విస్ట్ విశాల్.. 12 ఏళ్ళ పాత కంటెంట్ తో హిట్టా?
ఈ క్రమంలో 12 ఏళ్ళ పాత సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.
తమిళ నటుడు విశాల్ కు చాలా కాలంగా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేదు. పలు వివాదాలతో కూడా అతను ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తెలుగులో కూడా ఆ మధ్య పొలిటికల్ గా కామెంట్స్ చేసి వివాదం అయ్యాడు. ఇక బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ లేకపోవడంతో మార్కెట్ కూడా పోయింది. ఈ క్రమంలో 12 ఏళ్ళ పాత సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది.
2012లో రావాల్సిన సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా ఉహించని విధంగా హిట్ టాక్ రావడం ఆశ్చర్యం.
తమిళనాడు బాక్సాఫీస్ వద్ద పొంగల్ సీజన్‌లో ఇలా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. 12 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి అడుగుపెట్టిన మధ గజ రాజా సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోంది. 2012లో అనౌన్స్ చేసిన ఈ చిత్రం నానా సవాళ్లు ఎదుర్కొని, ఎన్నో వివాదాలు, వాయిదాలు పడుతూ చివరికి ఇప్పుడు విడుదలై హిట్ టాక్‌ను సంపాదించుకుంది.
సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఎవరు పట్టించుకోరేమో అని అనుకున్నారు. కానీ విడుదలైన తర్వాత సినిమా అంచనాలను మించిపోయి, థియేటర్లలో సందడి చేస్తోంది. కథ, స్క్రీన్‌ప్లే, కమెడీ సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతున్నాయి.
చెన్నై మీడియా, సోషల్ మీడియా రివ్యూల ప్రకారం మధ గజ రాజా ఫ్యామిలీ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోందట. సినిమా చాలా ఆలస్యంగా విడుదలైనా, దాని వినోదాత్మకత మాత్రం కాలానుగుణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సంతానం, విజయ్ ఆంటోనీ, విశాల్ తదితర నటీనటుల కామెడీ టైమింగ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.
సుందర్ సి వినోదాత్మక చిత్రాల దర్శకుడిగా పేరు పొందిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా ఆయన తన మార్క్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సినిమా విడుదలలో ఆలస్యమైనా వివాదాలైనా, కథనంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోననే ఆసక్తి ప్రేక్షకుల్లో పెంచాయి. సునీల్ శెట్టి, వివేక్ పాత్రలు కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.
బెస్ట్ కామెడీతో పాటు, ఈ చిత్రంలో మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఈ సినిమా హిట్ టాక్ రావడంతో, ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సక్సెస్‌తో సుందర్ సి తన క్రియేటివ్ టాలెంట్‌ను మరోసారి నిరూపించారు. 12 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ సృష్టించడం ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చగా మారింది.