SSMB29 క్రేజీ అప్డేట్: మహేశ్ తొలిసారిగా అలాంటి ప్రయత్నం..?!
ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు, తప్పకుండా రెండో భాగం ఉంటుందని ఆలోచించే పరిస్థితి వచ్చింది
ఇండియన్ సినిమాలో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఏదైనా పెద్ద సినిమా వస్తుందంటే చాలు, తప్పకుండా రెండో భాగం ఉంటుందని ఆలోచించే పరిస్థితి వచ్చింది. కానీ టాలీవుడ్ లో ఇప్పటి వరకూ సీక్వెల్స్, ఫ్రాంచైజీల జోలికి వెళ్లని అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పాలి. ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలంతా సీక్వెల్స్ లో భాగమయ్యారు కానీ.. మహేష్ మాత్రం ఈ ట్రెండ్ కు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మహేష్ సైతం సీక్వెల్స్ లో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం కోసం సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. SSMB29 అని పిలుచుకుంటున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ కు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ గ్లోబ్ ట్రాటింగ్ చిత్రాన్ని 2025 జనవరిలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు మహేష్ బాబు సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించడానికి జక్కన్న సన్నాహాలు చేసుకున్నారట. ఫస్ట్ పార్ట్ ని 2027లో, సెకండ్ పార్ట్ ని 2029లో విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి ఇంతకముందు 'బాహుబలి' చిత్రాన్ని 'ది బిగినింగ్', 'ది కన్ క్లూజన్' అంటూ 2 పార్ట్స్ గా తీసి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఫిలిం మేకర్స్ అందరూ రెండు భాగాలు అంటున్నారంటే దానికి బాటలు వేసింది రాజమౌళినే అని చెప్పాలి. అయితే ఇప్పుడు మహేశ్ మూవీని కూడా ఫ్రాంచైజీగా మార్చే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
'SSMB 29' సినిమాని రెండు పార్ట్స్ గా తీస్తే మాత్రం, మహేష్ బాబు దాదాపు ఐదు సంవత్సరాల పాటు రాజమౌళి సెట్ లోనే గడిపే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రాజమౌళి కెరీర్ లోనే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్ అవుతుందనడంలో సందేహం లేదు. దీని కోసం దుర్గా ఆర్ట్స్ తో పాటుగా ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ స్టూడియో కూడా నిర్మాణంలో భాగం పంచుకోనుందని టాక్ వినిపిస్తోంది.
ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా 'SSMB 29' తెరకెక్కనుంది. గ్రాండ్ స్కేల్ లో, హాలీవుడ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా మూవీ తీయడానికి రాజమౌళి గట్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. టాప్ టెక్నీషియన్స్, స్టార్ కాస్టింగ్ ఈ సినిమాలో పని చేయనున్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. మహేశ్ బాబు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే, అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.