అంబానీ పెళ్లిలో మహేష్ లుక్ లీక్
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల గ్రాండ్ వెడ్డింగ్ నిన్న సాయంత్రం ముంబై జియో వరల్డ్ లో జరిగిన సంగతి తెలిసిందే
అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ల గ్రాండ్ వెడ్డింగ్ నిన్న సాయంత్రం ముంబై జియో వరల్డ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం అంతర్జాతీయ సెలబ్రిటీలు విచ్చేసారు. వారితో పాటు బాలీవుడ్ ప్రముఖులంతా వేడుకలో సందడి చేసారు. చాలా మంది తమ అద్భుత పెర్ఫామెన్సెస్ తో వేదికను రక్తి కట్టించారు.
ఆసక్తికరంగా ఈ పెళ్లి వేడుకకు ఇటు దక్షిణాది నుంచి చెప్పుకోదగ్గ సినీసెలబ్రిటీలు అటెండయ్యారు. ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ తదితరులు ఉన్నారు. చరణ్ తో పాటు ఉపాసన ఈ పెళ్లికి అటెండయ్యారు. సౌత్ నుంచి అతిథుల జాబితా నిజంగా ఆశ్చర్యపరిచింది.
అతిథుల్లో రజనీకాంత్ పెళ్లికొడుకు అనంత్ అంబానీతో కలిసి డ్యాన్సులు చేయడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు స్టైలిష్ లుక్ తో షో స్టాపర్ గా మారారు. మహేష్ నలుపు రంగు షేర్వానీ ధరించారు. పొడవాటి గిరజాల జుత్తు గడ్డంతో కొత్తగా కనిపించాడు. అతడి లుక్ నిజానికి రాకుమారుడిని తలపించింది. మహేష్ తో పాటు ఈ పెళ్లిలో భార్య నమ్రత, కుమార్తె సితార సందడి చేసారు. మహేష్ బాబు పొడవాటి జుట్టు గురించి వేదిక వద్ద ఆసక్తికర చర్చ సాగింది. బహుశా ఇది రాజమౌళితో సినిమా కోసం మేకోవర్ అని అందరికీ అర్థమైంది. ఈ కొత్త లుక్ చాలా ముందే రివీలైపోవడంతో అభిమానుల్లో ఒకటే ఉత్సాహం పెరిగింది. ప్రస్తుతం అంబానీ పెళ్లి నుంచి రాకుమారుడిలా కనిపిస్తున్న మహేష్ లుక్ ని అభిమానులు అంతర్జాలంలో వైరల్ గా షేర్ చేస్తున్నారు.
ప్రపంచ సాహస యాత్రికుడి రూపం:
మహేష్ తదుపరి రాజమౌళి చిత్రంలో ప్రపంచ సాహస యాత్రికుడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పొడవాటి జుట్టు, గడ్డం, స్టైలిష్ మీసాలతో కొత్త రూపానికి షిష్టయాడు మహేష్. రాజమౌళి తన పాత్రను రూపొందించడానికి నాటకీయమైన మేకోవర్ కావాలని మహేష్ ని కోరారని తెలుస్తోంది. ఈ కొత్త అవతార్ సోషల్ మీడియాల్లో పెను సంచలనంగా మారుతోంది. మహేష్- రాజమౌళి ప్రాజెక్ట్‌పై విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. రాజమౌళి సినిమా వర్కింగ్ టైటిల్ - SSMB29. దీనికి అధికారికంగా టైటిల్ ని ప్రకటించాల్సి ఉంటుంది. కాగా ఈ సినిమాకి సంబంధించిన వర్క్‌షాప్‌లో మహేష్ పాల్గొనబోతున్నారని తెలిసింది.
మహేష్ నిజానికి ఒక బాలీవుడ్ స్టార్‌కి ఏమాత్రం తక్కువ కాదు. అతడి అసమానమైన ఆకర్షణ, అద్భుతమైన రూపాన్ని నిలకడగా అగ్ర బాలీవుడ్ తారలతో పోల్చారు. మహేష్ కి గతంలో బాలీవుడ్ లో నటించే అవకాశం వచ్చినా కానీ ఎందుకనో తిరస్కరించాడు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో హిందీ ఆడియెన్ లోకి దూసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. సరైన సమయంలో అతడి ప్రయత్నం ఫలిస్తోంది.