రీ రిలీజ్ లో మహేష్ దూకుడు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు, ఆగస్టు 9 అభిమానులకి ఒక పెద్ద పండుగలా మారింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టినరోజు, ఆగస్టు 9 అభిమానులకి ఒక పెద్ద పండుగలా మారింది. ప్రతి సంవత్సరం మహేశ్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులు చేసే హంగామా అందరికీ తెలిసిందే. కానీ ఈసారి మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు వారు సిద్ధమవుతున్నారు.
ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి సామాజిక బాధ్యతలను కూడా చాటుకుంటున్నారు. గతంలోనే మహేశ్ అభిమానులు హీరోల పుట్టినరోజుల సందర్భంగా సినిమాలను రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్‌ను సృష్టించారు. ఈ ట్రెండ్‌ని ప్రారంభించింది మహేశ్ బాబు "పోకిరి" సినిమా రీ రిలీజ్ అని చెప్పవచ్చు.
ఇప్పుడు, అదే ఉత్సాహంతో "మురారి" మరియు "ఒక్కడు" చిత్రాలను 4K క్వాలిటీలో తిరిగి విడుదల చేసేందుకు మహేశ్ బాబు అభిమానులు సిద్ధమయ్యారు. ఈ చిత్రాలు అప్పట్లోనే ఘన విజయాలు సాధించగా, ఇప్పుడు కూడా రీ రిలీజ్ ద్వారా భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. "మురారి" చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే 50 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం విశేషం.
ఇంకా బుక్ మై షోలో గడిచిన 24 గంటల్లో 40,000 టిక్కెట్ల బుకింగ్ నమోదైంది. ఇది మహేశ్ బాబు క్రేజ్ ఎక్కడికీ పోయిందని కాదు, అలా అనుకునే వాళ్లకు సమాధానం అని చెప్పాలి. ముఖ్యంగా సుదర్శన్ 35MM థియేటర్‌లో "మురారి" సినిమా కోసం ఒక్క టికెట్ కూడా మిగల్లేదు. ఇది మహేశ్ బాబు అభిమానులు పుట్టినరోజు సందర్భంగా చేసే హంగామాకు, వారి అంకితభావానికి అద్దం పడుతుంది.
అవీగాక, మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రాబోయే పాన్ ఇండియా సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ అప్డేట్ పుట్టినరోజు కానుకగా రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, మహేశ్ బాబు పుట్టినరోజు వేడుకలు ఈసారి మరింత ఘనంగా జరగడం ఖాయం.