మహేష్ ఒక్కడు ఒకవైపు..
బుధవారం 24 గంటల వ్యవధిలో గుంటూరు కారం చిత్రానికి మూడు లక్షల పైగా టికెట్లు అమ్ముడవగా.. హనుమాన్ మూవీకి దాదాపు 70 వేల టికెట్స్ సేల్ అయ్యాయి.
నిండు చందురుడు ఒక వైపు చుక్కలు ఒకవైపు.. అంటూ టక్కరి దొంగ సినిమాలో మహేష్ బాబు మీద ఒక పాట ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ మాట నిజమే అనిపిస్తూ ఉంటుంది. అందం, నటన, ఫ్యాన్ ఫాలోయింగ్, బాక్సాఫీస్ స్టామినా విషయంలో తానే సాటి అని అతను చాలా సందర్భాల్లో రుజువు చేశాడు.
యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తన స్టామినాతో బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కించేస్తుంటాడు ఈ నవతరం సూపర్ స్టార్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న గుంటూరు కారం సినిమా మీద ఇంతకుముందు ఎంత నెగిటివిటీ నెలకొందో తెలిసిందే. కానీ రిలీజ్ టైంకి ఆ నెగెటివిటీ అంతా పక్కకు పోయి బంపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ చిత్రం. అందుకు కారణం మహేష్ మేనియానే.
గుంటూరు కారం చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ చూసి అందరూ నోరెళ్ళబెడుతున్నారు. ఇదొక సగటు మాస్ సినిమా అయినప్పటికీ.. పాన్ ఇండియా సినిమాల స్థాయిలో దీనికి క్రేజ్ కనిపిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ కూడా అందుకు తగ్గట్లే జరుగుతున్నాయి. సంక్రాంతికి తెలుగుతో పాటు తమిళంలో కొన్ని క్రేజీ చిత్రాలు రిలీజ్ అవుతుండగా.. బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్ లో మహేష్ సినిమాకు, మిగతా వాటికి అంతరం చాలా ఎక్కువ ఉంది.
బుధవారం 24 గంటల వ్యవధిలో గుంటూరు కారం చిత్రానికి మూడు లక్షల పైగా టికెట్లు అమ్ముడవగా.. హనుమాన్ మూవీకి దాదాపు 70 వేల టికెట్స్ సేల్ అయ్యాయి. తమిళ చిత్రాలు కెప్టెన్ మిల్లర్, అయ్యలాన్లకు తలో 50వేల చొప్పున టికెట్లు అమ్ముడయ్యాయి. సైంధవ్, నా సామిరంగ చిత్రాలు ఇంకా పదివేల మార్కును కూడా అందుకోలేదు. సంక్రాంతికి తెలుగు, తమిళంలో రిలీజ్ అవుతున్న మిగతా అన్ని సినిమాల సేల్స్ కంటే మహేష్ మూవీ అమ్మకాలు ఎక్కువగా ఉండడం విశేషం. దీన్నిబట్టి మహేష్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.