జాతీయ అవార్డ్: అల్లు అర్జున్ గెయిన్ మహేష్ లాస్ అవుతుందా?
దర్శకుడు సుకుమార్‌తో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసిన మహేష్ సృజనాత్మక విభేధాలే కారణమని స్పష్ఠంగా వెల్లడించారు.
క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా మహేష్ - సుకుమార్ సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ సినిమాని ప్రకటించాడు. పుష్ప అలా సెట్స్ పైకి వెళ్లింది. అదే క్రమంలో త్రివిక్రమ్ తో మహేష్ సినిమాని ఖరారు చేసుకున్నాడు. అయితే మహేష్ కంటే ముందే సుక్కూ తన సినిమాని ప్రకటించాడు. ఆ సమయంలో నిజానికి ఈ ప్రాజెక్ట్ కాదనుకోవడానికి కారణం సుకుమార్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడమేనని మహేష్ వివరణ ఇచ్చారు.
దర్శకుడు సుకుమార్‌తో ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేసిన మహేష్ సృజనాత్మక విభేధాలే కారణమని స్పష్ఠంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు పుష్ప చిత్రం జాతీయ అవార్డులు గెలుచుకోవడంతో మహేష్ ఇలాంటి అరుదైన అవకాశాన్ని కోల్పోయాడని కొందరు నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. సుకుమార్ ని వదులుకుని మహేష్ తప్పు చేసాడని వాదిస్తున్నారు. అయితే ఇది సరైన వాదనేనా? అంటే వాస్తవం వేరుగా ఉంది.
నిజానికి మహేష్ కి సుకుమార్ వినిపించిన స్క్రిప్ట్ ఇది కానే కాదు. పుష్ప స్టోరీ కేవలం బన్నీకి మాత్రమే సుక్కూ వినిపించాడు. మహేష్ కి వినిపించిన బౌండ్ స్క్రిప్టు వేరొకటి. కానీ దానిని మహేష్ తిరస్కరించాడు. అందుకే ఇప్పుడు మహేష్ జాతీయ అవార్డును కోల్పోయాడని వాదించడం అవివేకమే అవుతుంది. నిజానికి స్టార్లు జారవిడుచుకున్న కొన్ని కథలు ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో అసాధారణ విజయాలుగా మారిన సందర్భాలున్నాయి. అలాగే గొప్ప డిజాస్టర్లుగా మారినవి ఉన్నాయి. అందుకే తారల వ్యక్తిగత నిర్ణయాలను ఇక్కడ పరిగణించకూడదు.
ఒక సినిమా సెట్స్ కి వెళుతోంది అంటే దాని వెనక చాలా తతంగమే ఉంటుంది. చాలా విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళుతుంది. ముఖ్యంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం సాధ్యపడదు. ఇకపోతే సుకుమార్ అప్పటికి మహేష్ తో సినిమా చేయకపోయినా భవిష్యత్ లో ఈ కాంబినేషన్ సినిమాకి ఆస్కారం లేకపోలేదు. దీనిపై ఆ ఇద్దరూ పాజిటివ్ గానే ఉన్నారు. ఇకపోతే సుకుమార్ తో 1నేనొక్కడినే సినిమా ఎప్పటికీ కల్ట్ క్లాసిక్ జాబితాలో ఉంటుందని మహేష్ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు.