కష్టాల్లో మాలీవుడ్.. గతేడాది నష్టాలు తెలిస్తే షాక్
కేరళ చలనచిత్ర నిర్మాతల సంఘం (కె.ఎఫ్.పి.ఏ) 2024లో మలయాళ చిత్ర పరిశ్రమ నష్టాలపై గుండెలదిరే నిజాలు చెప్పింది.
భారతదేశంలో అత్యుత్తమమైన ఒరిజినల్ కంటెంట్‌ని అందించే పరిశ్రమగా మలయాళ చిత్రసీమకు గుర్తింపు ఉంది. యేటేటా జాతీయ అవార్డులను కొల్లగొట్టడంలో ఎప్పుడూ ఈ పరిశ్రమ ముందుంటుంది. దిగ్గజ దర్శకులు ఎందరో ఈ ఇండస్ట్రీని అత్యున్నత శిఖరానికి చేర్చారు. కానీ మాలీవుడ్ ఇప్పటికీ 200 కోట్ల క్లబ్ సినిమాలను అందించలేదు. 500 కోట్లు, 1000 కోట్ల క్లబ్ సినిమాలను పరిమిత బడ్జెట్లతో సినిమాలు తీసే ఈ పరిశ్రమ నుంచి ఆశించలేం.
అదంతా అటుంచితే మాలీవుడ్ గత ఏడాది ఏకంగా 700 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం షాకింగ్ విషయం. మంజుమ్మెల్ బాయ్స్, ఆడుజీవితం: ది గోట్ లైఫ్, ఆవేశం, ప్రేమలు, A.R.M., కిష్కింధ కాండం, మార్కో వంటి మలయాళ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించాయి. కానీ ఇటీవల కేరళ చలనచిత్ర నిర్మాతల సంఘం (KFPA) నివేదిక ఆశ్చర్యకరంగా 2024లో రూ.650-700 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఇది విశ్లేషకులను చాలా ఆశ్చర్యపరిచింది. ఇండస్ట్రీ ట్రేడ్ విశ్లేషణ నిజంగా షాకిచ్చింది.
కేరళ చలనచిత్ర నిర్మాతల సంఘం (కె.ఎఫ్.పి.ఏ) 2024లో మలయాళ చిత్ర పరిశ్రమ నష్టాలపై గుండెలదిరే నిజాలు చెప్పింది. గతేడాది విడుదలైన 204 చిత్రాలలో 5 క్లాసిక్ మలయాళ చిత్రాల రీ-రిలీజ్ లు సహా 26 మాత్రమే ఆర్థిక విజయాన్ని సాధించాయి. సూపర్ హిట్, హిట్ లేదా యావరేజ్ లు ఇందులో ఉన్నాయి. ఈ 26 చిత్రాలు సమిష్టిగా రూ.300-350 కోట్ల మేర నికర లాభాన్ని తెచ్చిపెట్టాయి. కె.ఎఫ్.పి.ఏ గణాంకాలు గ్రాస్ కాకుండా, నికర లాభాలను పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కల వివరాల్ని అందించాయి. గతేడాది 170 పైగా చిత్రాలు ఫ్లాపులుగా మిగిలాయి. దీని కారణంగా మాలీవుడ్ కి భారీ నష్టాలు సంభవించాయి. గత సంవత్సరం పరిశ్రమలో మొత్తం పెట్టుబడి రూ.1000 కోట్లు.
2023, 2024 సంవత్సరాల్లో 200 మించి సినిమాలను మలయాళంలో రిలీజ్ చేసారు. కానీ ఎప్పటిలానే నష్టాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కారణం ఏదైనా కానీ ఫ్లాపుల వల్ల సరైన ప్రీరిలీజ్ వ్యాపారం జరగడం లేదని, ఓటీటీ ఒప్పందాలు నీరసించాయని మలయాళ నిర్మాతలు వాపోతున్నారు. దీంతో ఇప్పుడు అదుపు తప్పుతున్న బడ్జెట్ల గురించి సమీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇకపై బడ్జెట్ కోతలు తప్పదని కూడా అంచనా వేస్తున్నారు. నటీనటుల పారితోషికాలను తగ్గించాల్సి ఉంటుందని, గతంలో మాదిరి కాకుండా ఈసారి చర్యలకు వెనకాడబోరని కూడా విశ్లేషించారు.