మహా కుంభమేళాలో కాషాయంతో షాకిచ్చిన నటి
గురువుల సాక్షిగా భక్తురాలిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రేమ శిఖరం, దొంగా పోలీస్ లాంటి తెలుగు చిత్రాల్లో కథానాయికగా నటించారు మమతా కులకర్ణి. హిందీ బెంగాళీ కన్నడలోను మమత కథానాయికగా నటించారు. 90లలో గ్లామరస్ నాయికగా కనిపించిన మమతా అద్భుత నర్తకి కూడా. దానికి మించి గ్లామర్ వరల్డ్ లో పలు వివాదాలతో పాపులరైంది. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ ఓ వెలుగు వెలిగిన మమతా ఇప్పుడు అనూహ్యంగా కాషాయం ధరించి డివోటీగా మారారు. తన వయసు 55. దానికి తగ్గట్టుగానే లోతైన ఆధ్యాత్మిక భావనలను కలిగి ఉన్నారు. గురువుల సాక్షిగా భక్తురాలిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం జనవరి 29న మౌని అమావాస్య స్నానం కోసం ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న మమతా తన తీర్థయాత్ర ప్రణాళికలను చర్చిస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసారు. ప్రయాగ్‌రాజ్‌లో తన పూజలు, ఆచారాలను పూర్తి చేసిన తర్వాత, కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనం కోసం వారణాసికి వెళతానని మమతా వెల్లడించారు. దీని తర్వాత అయోధ్యకు వెళ్లాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఈ 10 రోజుల ఆధ్యాత్మిక ప్రయాణంలో, మమతా తన దివంగత తల్లిదండ్రులను గౌరవించే పవిత్ర ఆచారం అయిన పిత్ర తర్పణాన్ని కూడా చేయనుందిట.
మహా కుంభమేళా ప్రాంతంలో పలువురు మహిళా భక్తులతో పాటు, మమతా కులకర్ణి కాషాయ వేషధారణలో కనిపించారు. కుంభమేళా కోసం కోట్లాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. విదేశాల నుంచి చాలా మంది భక్తులు వచ్చి తరిస్తున్నారు.