మీడియా ముందుకు మంచు విష్ణు... తండ్రి, తమ్ముడిపై కీలక వ్యాఖ్యలు!
తన కుటుంబంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం మంగళవారం పీక్స్ కి చేరినట్లయ్యిందని అంటున్నారు. ఈ సమయంలో ఓ పక్క మోహన్ బాబు, ఆయన భార్య, చిన్న కుమారుడు మనోజ్ అస్వస్థతకు గురైన పరిస్థితి. ఈ సమయంలో మంచు విష్ణు విలేకరులతో మాట్లాడారు.
అవును... తన కుటుంబంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో మంచు విష్ణు స్పందించారు. ఈ మేరకు కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమది ఉమ్మడి కుటుంబం అని.. తామంతా కలిసి మెలిసి ఉంటామని అనుకున్నామని.. అయితే, దురదృష్టవశాత్తు ఇలా జరిగిందని అన్నారు.
ఈ వివాదం తమ మనసులను ఎంతో భాధపెడుతోందని అన్నారు. త్వరలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మమ్మల్ని విపరీతంగా ప్రేమించడమే నాన్న చేసిన తప్పని విష్ణు వ్యాఖ్యానించారు. ఇక.. ఇలాంటి సమస్యలు ప్రతీ కుటుంబంలోనూ ఉంటాయని.. దయచేసి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయొద్దని మీడియాను రిక్వస్ట్ చేశారు.
ఈ సందర్భంగా... ఈ రోజు తమ అమ్మ ఆస్పత్రిలో చేరారని.. నిన్న జరిగిన ఘర్షణలో నాన్నకు గాయాలయ్యాయని.. ఇంటి పెద్ద కుమారుడిగా తాను చాలా బాధపడుతున్నానని విష్ణు చెప్పుకొచ్చారు. జరుగుతున్న గొడవకు ఆస్తులా, మనోజ్ వివాహమా కారణం? అని అడిగిన ప్రశ్నకు... కచ్చితంగా వివాహం అయితే కాదని విష్ణు వెల్లడించారు!
తన తండ్రి ఇంటిలో ఉండమని కోరే హక్కు, ఉండొద్దని చెప్పే అధికారం ఆయనకే ఉన్నాయని.. ఆయన మనోజ్ ని తన ఇంట్లో ఉండొద్దని అన్నారంటే అర్ధం చేసుకోవాలని తెలిపారు. మనోజ్ ప్రవర్తన బాగాలేదా అనే ప్రశ్నకు స్పందిస్తూ.. యాక్షన్ స్పీక్స్ మోర్ దేన్ వర్డ్స్ అంటూ విష్ణు రియాక్ట్ అయ్యారు.
తాను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం లాస్ ఏంజెల్స్ లో ఉన్నప్పుడు తనకు ఈ విషయం గురించి ఫోన్ వచ్చిందని.. దీంతో అన్నీ అక్కడే వదిలేసి వచ్చేశానని.. అన్నింటికంటే కుటుంబమే ముఖ్యమని.. తాను నిన్ననే హైదరాబాద్ వచ్చానని.. తాను ఊర్లో లేని నాలుగు రోజుల్లో ఇదంతా జరిగిపోయిందని విష్ణు చెప్పుకొచ్చారు.
ఇక నిన్న జరిగిన గొడవలో ఓ రిపోర్టర్ కు గాయాలయ్యాయని.. ఇది దురదృష్టకరమని.. ఉద్దేశ్యపూర్వకంగా ఎవరినీ మేము బాధ పెట్టాలనుకోలేదని.. విజువల్స్ ని సరిగ్గా చూస్తే నిన్న నాన్న మీడియా ముందుకు నమస్కారం పెట్టుకుంటూనే వచ్చారని.. ఆ సమయంలో ముఖంపై మైకు పెట్టగానే క్షణికావేశంలో దాడి చేశారని విష్ణు తెలిపారు.
ఈ క్రమంలో ఇప్పటికే ఆ విలేకరి కుటుంబంతో తాను ఫోన్ లో మాట్లాడానని.. అవస్రమైన సాయం చేస్తామని.. ఆ కుటుంబంతో టచ్ లో ఉన్నామని విష్ణు వెల్లడించారు. తమ కుటుంబ సమస్య పరిష్కరించుకోవాలని.. పరిష్కారం అవుతుందని.. ఇంతకంటే ఎక్కువగా తన కుటుంబ విషయాలు తాను బయటకు చెప్పనని విష్ణు తెలిపారు.