'మా' ప్రెసిడెంట్ ఎందుకు సీఎంను కలవలేదు?
రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదో కారణాలు తెలియ లేదు. దీంతో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా? లేదా ప్రస్తుతం ఇండియాలో లేరా? ఉన్నా మీటింగ్ రాలేకపోయారా? అనే చర్చలు మొదలయ్యాయి.
టాలీవుడ్ ప్రముఖులు తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖుల బృందం గురువారం ఉదయం సీఎంను కలిసి వచ్చారు. ఈ సమావేశంలో 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది హీరోలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మీటింగ్ లో 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
అక్కినేని నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు.. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు, మురళీ మోహన్ లాంటి సీనియర్ దర్శక నిర్మాతలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. కిరణ్ అబ్బవరం, సిద్ధూ జొన్నలగడ్డ వంటి యంగ్ హీరోలు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా పాల్గొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో వివిధ సంస్థల నుంచి పలువురు సినీ ప్రముఖులు వచ్చాయి. కానీ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ అధ్యక్షుడైన హీరో విష్ణు రాలేదు.
తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధితో పాటు, ఇండస్ట్రీ ఎదుర్కొంటోన్న సమస్యల మీద ప్రభుత్వంతో టాలీవుడ్ పెద్దలు చర్చించారు. ఈ సమావేశంలో సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. టాలీవుడ్ కేంద్రమైన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమేం చెయ్యాలనే దానిపై చర్చించారు. ఇలాంటి కీలకమైన 'మా' అధ్యక్షుడు కూడా ఉంటే బాగుండేదని అంటున్నారు.
రేవంత్ రెడ్డితో మీటింగ్ కి మంచు విష్ణు ఎందుకు రాలేదో కారణాలు తెలియ లేదు. దీంతో సినిమా పనుల్లో బిజీగా ఉన్నారా? లేదా ప్రస్తుతం ఇండియాలో లేరా? ఉన్నా మీటింగ్ రాలేకపోయారా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే తాను రాలేకపోతున్నందునే మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ తరపున నటుడు శివ బాలాజీని పంపించి ఉంటారని అభిప్రాయ పడుతున్నారు. శివ బాలాజీ ప్రజంట్ 'మా' ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాబట్టి విష్ణు రాలేని కారణంగా అసోషియేషన్ నుంచి ఆయన వచ్చి ఉంటారని భావిస్తున్నారు.
సీఎంతో భేటీ కానప్పటికీ, సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. "మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సహా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారితో సమావేశమయ్యారు. చిత్ర పరిశ్రమకు సానుకూల వాతావరణాన్ని పెంపొందించడంలో వారి చురుకైన మద్దతును అభినందిస్తున్నాము. తెలంగాణ ప్రభుత్వంతో ఫలవంతమైన అనుబంధం కోసం ఎదురుచూస్తున్నాం" అని విష్ణు 'ఎక్స్' లో పోస్ట్ పెట్టారు.