భారీ ప్లాన్..హంగామా సరే..మంచు హీరో మ్యాజిక్ చేసేనా?
అంతే కాకుండా ప్రేక్షకుల్లోనూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలని ఆదరించిన స్థాయిలో మంచు వారబ్బాయిల సినిమాలని ప్రోత్సహించడం లేదు.
సమకాలీన హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలు, బ్లాక్ బస్టర్లు చేస్తూ జెట్ స్పీడుతో ముందుకెళ్లిపోతున్నారు. కానీ మంచు వారు మాత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఎలాంటి కదలిక లేదు. కారణం మంచు హీరోలు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్లుగా నిలవడమే. అంతే కాకుండా ప్రేక్షకుల్లోనూ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమాలని ఆదరించిన స్థాయిలో మంచు వారబ్బాయిల సినిమాలని ప్రోత్సహించడం లేదు. దీంతో హీరోలుగా తెరంగేట్రం చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క బ్లాక్ బస్టర్‌ని కాదు కదా కనీసం హిట్‌ని కూడా దక్కించుకోలేకపోతున్నారు.
మంచు మనోజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చేసి ఈ మధ్యే మళ్లీ మొదలు పెట్టాడు. ఇక మంచు విష్ణుది కూడా దాదాపు అదే పరిస్థితి. అయితే ఇవన్నీ పక్కన పెట్టి మార్కెట్ లెక్కలని సైతం పట్టించుకోకుండా తన డ్రీమ్ ప్రాజెక్ట్ `కన్నప్ప`ని ప్రారంభించాడు. మోహన్ బాబు సమర్పణలో బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ రూపొందిస్తున్నారు. న్యూజిలాండ్‌లో ఇటీవలే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో నిర్మిస్తున్నారు.
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో కన్నప్పగా మంచు విష్ణు నటిస్తుండగా కీలక పాత్రలైన శివ పార్వతులుగా ప్రభాస్, నయనతార కనిపించనున్నారు. ఇప్పటికే వీరిద్దరి పేర్లు బయటికి రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఓ ఊపొచ్చింది. `యోగి` సినిమా తరువాత ప్రభాస్, నయనతార కలిసి నటించనున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మరో కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని ఫైనల్ చేశారు.
వీరే కాకుండా మరి కొంత మంది క్రేజీ స్టార్ల పేర్లు కూడా కీలక క్యారెక్టర్ల కోసం పరిశీలిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్ రానా కూడా నటిస్తారని తెలుస్తోంది. అంతా బాగానే ఉంది. మంచు విష్ణు ప్లానింగ్..హంగామా అంతా ఓకే కానీ మంచు హీరో మ్యాజిక్ చేస్తాడా? అన్నదే ఇప్పుడు అసలు చర్చగా మారింది. ఇంత వరకు స్టార్ డమ్‌ని సొంతం చేసుకోలేదు. భారీ హిట్‌ని తన ఖాతాలో వేసుకోలేదు. మరి `కన్నప్ప`తో వాటన్నింటిని మరిపించి మ్యాజిక్ చేస్తాడా? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అన్నీ కరెక్ట్‌గా కుదిరి మ్యాజిక్ చేస్తే మంచు విష్ణు కెరీర్ మలుపు తిరిగినట్టే.