టాలీవుడ్‌కి 3రోజుల సెలవు దేనికోసం?
తెలుగు సినిమా 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలైలో మూడు రోజుల పాటు సినిమాల చిత్రీకరణకు విరామం తీసుకోవచ్చు.
తెలుగు సినిమా 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జూలైలో మూడు రోజుల పాటు సినిమాల చిత్రీకరణకు విరామం తీసుకోవచ్చు. ఈ జూలైలో వార్షికోత్సవ వేడుకలను మలేషియాలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు `మా` అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా వేడుకలను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అయితే ఇంకా డెసిషన్ ఫైనల్ కావాల్సి ఉంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో మంచు విష్ణుకి ఈ ఆలోచన వచ్చింది. పరిశ్రమలోని ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడుతున్నామని అన్నారు. ఈ వార్షికోత్సవానికి అందరూ అంగీకరించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కోరింది.
అయితే మూడు రోజుల పాటు షూటింగులు ఆపేయడం అంటే అది అంత సులువేమీ కాదు. ఎవరికి వారు డెడ్ లైన్లు పెట్టుకుని కాల్షీట్లను సర్ధుబాటు చేసుకుని సినిమాలు చేస్తుంటారు. వాటన్నిటినీ సర్ధుబాటు చేయాలంటే తలకుమించిన భారం. కానీ సినీపెద్దలు ఆమోదిస్తే.. షూటింగ్‌లను ఆపివేసి వేడుకల్లో పాల్గొనేందుకు ఛాన్సుంటుందని భావిస్తున్నారు. `మా` ఈ ఈవెంట్‌ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోనుంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద సినిమాలకు టైట్ షెడ్యూల్స్ ఉండటం వల్ల కష్టమే అయినప్పటికీ, వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించాలని విష్ణు అండ్ అసోసియేషన్ సీరియస్ గా ఉంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉంది. భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుని 110 సంవత్సరాలకు చేరువవుతోంది. ఇదే సమయంలో టాలీవుడ్ 90వ వార్షికోత్సవ దిశగా సాగుతుండడం ఆసక్తికరం.