బతుకుతానని అస్సలు అనుకోలేదు
క్యాన్సర్‌ను జయించిన మనీషా కోయిరాలా మళ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
90ల్లో ఇండస్ట్రీల్లో అడుగు పెట్టి తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ మనీషా కోయిరాలా. దాదాపు ఇరవై సంవత్సరాల పాటు హిందీ, తెలుగు, తమిళ ఇంకా ఇతర భాషల్లోనూ నటించి మెప్పించింది. బాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు టాప్ హీరోయిన్‌గా కొనసాగి దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆ సమయంలో నటించిన మనీషా కోయిరాలా 2012 సంవత్సరంలో క్యాన్సర్ బారిన పడ్డారు. మనీషా అండాశయ క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడ్డారు. దాదాపు మూడు సంవత్సరాల పాటు క్యాన్సర్స్ కారణంగా బాధ పడ్డారు. క్యాన్సర్‌ను జయించిన మనీషా కోయిరాలా మళ్లీ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అండాశయ క్యాన్సర్ అవ్వడంతో మనీషా కోయిరాలా చివరి స్టేజ్ వరకు గుర్తించలేక పోయిందట. సాధారణంగా చివరి స్టేజ్ లో ఉండగా చికిత్స సైతం పని చేయదు అంటారు. కానీ మనీషా కోయిరాలా పట్టుదలతో ప్రాణాలు నిలుపుకోవాలనే దృడ సంకల్పంతో క్యాన్సర్‌తో పోరాటం చేశారు. ఆమె పోరాటం ఫలించింది. 2015లో క్యాన్సర్ నుంచి మనీషా పూర్తిగా క్యూర్ అయ్యారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్న మనీషా కోయిరాలా తన జీవితంలో ఎదుర్కొన్న ఆ గడ్డు పరిస్థితుల గురించి ఆ మూడు సంవత్సరాల గురించి రెగ్యులర్‌గా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉంటారు. క్యాన్సర్ బారిన పడ్డ వారు అధైర్య పడకుండా ఉండాలని సూచిస్తూ ఉంటారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనీషా కోయిరాలా మాట్లాడుతూ... క్యాన్సర్ బారిన పడ్డ సమయంలో నేను తీసుకున్న చికిత్స నాకు ఇప్పటికీ గుర్తు ఉంటుంది. ఆ సమయంలో భరించలేని నొప్పి, ఆ బాధను కనీసం వర్ణించలేని పరిస్థితి. చివరి స్టేజ్ అవ్వడంతో బతుకుతానని అస్సలు అనుకోలేదు. సాధారణంగా చివరి స్టేజ్ క్యాన్సర్‌తో పోరాటం చేయడం అనేది వృదా ప్రయాస అని కొందరు అంటారు. కానీ అమెరికాకు వెళ్లడంతో అక్కడ వైద్యులు గొప్ప చికిత్స అందించారు. ఆరు నెలల పాటు నేను చికిత్స తీసుకున్నాను. న్యూయార్క్‌లో ఉన్న గొప్ప వైద్యులు, నా తల్లి వల్ల నేను ఈరోజు బతికి ఉన్నాను.
11 గంటల ఆపరేషన్ సమయంలో నేను తిరిగి లేస్తానా అనిపించింది. వైద్యం జరుగుతున్న సమయంలో నా వెంట ఉండి అమ్మ ప్రోత్సాహంగా నిలవడంతో పాటు, నాకు క్యాన్సర్ నయం కావాలని అమ్మ మహా మృత్యుంజయ హోమం తో పాటు, ఎన్నో పూజలు చేయించారు. ప్రతి సమయంలోనే మనీషా నీకు ఏం కాదు ధైర్యంగా ఉండు అంటూ అమ్మ ప్రోత్సహిస్తూనే వచ్చింది. అమ్మ ఇచ్చిన ధైర్యం, వైద్యులు ఇచ్చిన ట్రీట్మెంట్ తో నేను క్యాన్సర్‌ను చివరి స్టేజీలో ఉన్నా జయించాను. ప్రతి మనిషికీ క్యాన్సర్ ను జయించడం అంటే అది రెండో జన్మ దక్కినట్లే. నాకు కూడా ఇది దేవుడు ఇచ్చిన రెండో జీవితంగా భావిస్తాను. బతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా జీవిస్తూ, ఇతరులకు సాయం చేయాలని అనుకుంటాను అంటూ మనీషా కోయిరాలా చెప్పుకొచ్చింది.