చిరంజీవి- ఖుష్బూ- త్రిషలపై మన్సూర్ దావా! వాట్ నెక్స్ట్ ?
అయితే ఈ వివాదంలో భేషరతుగా త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్ గొడవను అంతటితో వదిలేయలేదు
దళపతి విజయ్ - త్రిష కృష్ణన్- సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన లోకేష్ కనగరాజ్ చిత్రం 'లియో' తమిళంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో భాగమైన మరో నటుడు మన్సూర్ అలీ ఖాన్ మీడియా ఇంటర్వ్యూలో త్రిషపై తీవ్రమైన కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అతడి కామెంట్లను ఖండిస్తూ మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి ఖుష్బూ వ్యాఖ్యానించారు. మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష కౌంటర్ వేసారు.
అయితే ఈ వివాదంలో భేషరతుగా త్రిషకు క్షమాపణలు చెప్పిన మన్సూర్ అలీఖాన్ గొడవను అంతటితో వదిలేయలేదు. తనను అవమానించారంటూ చిరు, ఖుష్బూ, త్రిషలపై అతడు దావా వేసాడు. సుమారు కోటి రూపాయల మేర పరువునష్టం దావా వేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మన్సూర్ అలీఖాన్ తమిళ పరిశ్రమలో సహాయ నటుడిగా కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు ఈ వివాదంతో హెడ్ లైన్స్ లోకొచ్చారు.
అతడు ఇంతకుముందు త్రిషపై చేసిన కామెంట్ సంచలనమైంది. ''త్రిషతో కలిసి నటిస్తున్నానని విన్నప్పుడు సినిమాలో బెడ్‌రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. నా మునుపటి సినిమాల్లో ఇతర నటీమణులతో చేసినట్లే ఆమెను బెడ్‌రూమ్‌కి తీసుకెళ్లవచ్చని అనుకున్నాను. నేను చాలా రేప్ సన్నివేశాలు చేసాను. ఇది నాకు కొత్త కాదు'' అని మన్సూర్ పచ్చిగా మాట్లాడారు. దీనిని త్రిష వెంటనే ఖండించగా, చిరు, ఖుష్బూ, చిన్మయి శ్రీపాద సహా పలువురు స్టార్లు తీవ్రంగా తప్పు పట్టారు. కానీ మన్సూర్ అలీఖాన్ ఇప్పుడు పరువునష్టం దావా వేయడం పరిశ్రమలో చర్చగా మారింది.
త్రిష ఆవేదన:
మన్సూర్ తనపై కామెంట్ చేసిన వీడియో వైరల్ కావడంతో, త్రిష X లో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. త్రిష వ్యాఖ్యానిస్తూ- “మిస్టర్ మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది లైంగిక ప్రస్థావన.. స్త్రీలపై అగౌరవం, స్త్రీ ద్వేషం, అసహ్యకరమైన చెడు అభిరుచి. నీలాంటి దయనీయమైన వ్యక్తితో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనందుకు నేను కృతజ్ఞురాలిని. నా మిగిలిన సినిమా కెరీర్‌లో కూడా అలా జరగకుండా చూసుకుంటాను. అతనిలాంటి వ్యక్తులు మానవాళికి చెడ్డపేరు తెస్తారు'' అని వ్యాఖ్యానించారు.
తనపై తీవ్రమైన విమర్శల దుమారం చెలరేగడంతో త్రిషను క్షమించమని మన్సూర్ అధికారిక ప్రకటనలో అభ్యర్థించాడు. “నా సహనటి త్రిష నన్ను క్షమించండి! మీ వివాహంలో మిమ్మల్ని ఆశీర్వదించే అవకాశాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు'' అని అన్నాడు.
క్షమాపణ తర్వాత పరువు నష్టం దావా
అయితే, క్షమాపణ చెప్పిన తర్వాత ఖాన్ ఇప్పుడు కృష్ణన్‌పై దావా వేశారు. అతడు మాట్లాడుతూ, “మేము ఈ రోజు పరువు నష్టం కేసు దాఖలు చేస్తున్నాం. మేము అన్ని పత్రాలను సిద్ధం చేసాం. (నా) న్యాయవాది ఇతర సమాచారాన్ని వెల్లడిస్తారు'' అని మన్సూర్ అన్నారు.
దీనిపై సీనియర్ నటుడు చిరంజీవి గతంలో స్పందించారు. త్రిష గురించి నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఖండించదగినవి. ఇలాంటి వ్యాఖ్యలు ఒక కళాకారిణికి మాత్రమే కాదు... ఏ స్త్రీకి లేదా అమ్మాయికి అయినా అసహ్యం కలిగించేవి.. ఈ వ్యాఖ్యలను బలంగా ఖండించాలి. వారు వక్రబుద్ధితో కొట్టుమిట్టాడుతున్నారు. త్రిషతో పాటు ఇలాంటి భయంకరమైన వ్యాఖ్యలకు గురయ్యే ప్రతి మహిళకు నేను అండగా ఉంటాను'' అని చిరంజీవి ఎక్స్‌లో రాసారు.
తన పక్షాన నిలిచిన తెలుగు చిత్రసీమకు త్రిష కృతజ్ఞతలు తెలిపారు. త్రిషకు లియో దర్శకుడు కనగరాజ్ .. గాయని చిన్మయి శ్రీపాద సహా ఇతరుల నుంచి కూడా మద్దతు పొందింది. లియో ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.