మరో ప్రియాంక చోప్రా అవుతుందనుకుంటే..!
ఆరేడేళ్లుగా సినీరంగంలో కథానాయికగా నిరూపించుకునే ప్రయత్నంలో తడబడుతూనే ఉంది మానుషి చిల్లర్
ఆరేడేళ్లుగా సినీరంగంలో కథానాయికగా నిరూపించుకునే ప్రయత్నంలో తడబడుతూనే ఉంది మానుషి చిల్లర్. ఐశ్వర్యారాయ్, సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా సహా ఎందరో మాజీ మిస్సుల బాటలోనే ఈ మిస్ బ్యూటీ బాలీవుడ్ లో పెద్ద కెరీర్ ఆశించింది. ఇండియాలో పెద్ద స్టార్ అవ్వాలని కలలు కంది. కానీ ఈ బ్యూటీ ఏ ముహూర్తాన కెరీర్ ప్రారంభించిందో కానీ, ఆ తర్వాత అన్నీ అపశకునములే.
మానుషి చిల్లర్ తనకు నటించాలనుందని ప్రకటించిన అనంతరం వరుసగా ఎన్నో చిక్కుల్ని ఎదుర్కొంది. తన కలల గురించి వ్యాఖ్యానించిన చాలా ఏళ్లకు కానీ మొదటి సినిమా అవకాశం రాలేదు. ఆ సినిమా పూర్తయి విడుదలైనా తనకు ఏ విధంగాను కలిసి రాలేదు. ఖిలాడీ అక్షయ్ కుమార్ అంతటి పెద్ద స్టార్ సరసన `పృథ్వీరాజ్` లాంటి భారీ హిస్టారికల్ చిత్రంలో నటించినా కానీ అది కూడా కలిసి రాలేదు. వరుస వైఫల్యాలు ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే మానుషి నటిగా ఎదిగే క్రమంలోనే, కరోనా మహమ్మారీ ప్రవేశించి తన సినిమాల రిలీజ్ లను అంతకంతకు ఆలస్యం చేసింది.
నిజానికి ఐష్, సుస్మితాసేన్, ప్రియాంక చోప్రా తరహాలో పెద్ద స్థాయిని కోరుకున్నా అది దక్కకపోవడానికి కారణం ఈ అమ్మడు నిజంగానే దురదృష్ట నాయిక అనడంలో సందేహం లేదు. మానుషికి లక్ ఏవిధంగాను ఫేవర్ చేయలేదనే చెప్పాలి. ఇటీవలే భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ `బడే మియాన్ చోటే మియాన్` లోను మానుషి అక్షయ్ సరసన నటించింది. కానీ ఈ సినిమా ఖిలాడీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే తనకు విజయాలు దక్కకపోయినా.. వరుస డిజాస్టర్లు ఇబ్బంది పెడుతున్నా కానీ.. మానుషి ఇప్పటికీ తనవంతు ప్రయత్నాలను ఆపలేదు.
సోషల్ మీడియాల్లో ఒకవైపు .. మ్యాగజైన్ కవర్ షూట్లతో మరోవైపు రేస్‌లో నేనున్నాను! అంటూ తన వంతు ప్రయత్నాల్లో ఉన్నారు మానుషి. తాజాగా పీకాక్ మ్యాగజైన్ కవర్ షూట్ లో పాల్గొన్న ఈ బ్యూటీ అందచందాలను ఈ ఫోటోషూట్ ఎంతో అద్భుతంగా ఎలివేట్ చేసిందని చెప్పాలి. పీకాక్ కవర్ ఇంటర్వ్యూలో మానుషి తన మాతృమూర్తి గురించి చెప్పిన కొన్ని సంగతులు ఆసక్తిని కలిగించాయి.
మానుషి మాట్లాడుతూ...``నా తల్లి నాపై చాలా ప్రభావం చూపింది. నేను ఎదుగుతున్నప్పుడు రక్షణగా చూసుకున్న వ్యక్తి ఆమె. గొప్ప పేరెంట్‌గానే కాకుండా అమ్మ నాకు చాలా మంచి స్నేహితురాలు. తను నేను విశ్వసించగల వ్యక్తి.. ప్రపంచంలోని ఏదైనా.. ప్రతిదాని గురించి నేను అమ్మకు చెప్పగలను. అలా ఎదుగుతున్నప్పుడు, నేను ఎప్పుడూ అమ్మలానే ఉండాలని కోరుకున్నాను. ఆమె చాలా అందంగా ఉంది.. కాబట్టి నేను తనలా కనిపించాలని, తనలాగే దుస్తులు ధరించాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. కాబట్టి మా అమ్మ నా జీవితంలో చాలా పెద్ద ప్రభావశీలి... చాలా పెద్ద ప్రేరణ. నేను తీసుకున్న ఏ నిర్ణయాలపై అయినా అమ్మ గొప్ప ప్రభావాన్ని చూపింది. ఎందుకంటే నేను నిజంగా ఆమెను చూస్తున్నాను! అని అన్నారు.
అయితే మ్యాగజైన్ ఇంటర్వ్యూలో మానుషిని ఇంకా ``అప్ కమింగ్ యాక్టర్`` అంటూ ప్రస్థావించారు. ఇది టైపో ఎర్రర్ కాదు. నిజానికి మానుషి కథానాయికగా కెరీర్ ప్రారంభించి చాలా కాలమే అయింది. కొన్నేళ్లలో నటించిన సినిమాలు తక్కువే కానీ అగ్ర హీరో సరసన అవకాశాలు అందుకుంది. కానీ అవేవీ విజయాలు సాధించలేదు. అందుకే ఇప్పటికీ అప్ కమ్ హీరోయిన్ అంటూ మ్యాగజైన్ ప్రస్థావించిందన్నమాట.