సెట్స్ లో ఉన్న చిత్రం 2026 లోనే? ఇదేం ట్విస్ట్!
ముఖ్యంగా రాణీముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన `మర్దానీ` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
బాలీవుడ్ లో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలంటే ఠక్కున గుర్తొచ్చే సీనియర్ భామ రాణీ ముఖర్జీ. ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో తానో బ్రాండ్ అని ప్రూవ్ చేసింది. ఆమెని చూసే విద్యాబాలన్, కరీనా కపూర్ ఖాన్, దీపికా పదుకొణే, అలియాభట్ లాంటి భామలు సైతం లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో సత్తా చాటడం మొదలు పెట్టారు. ముఖ్యంగా రాణీముఖర్జీ ప్రధాన పాత్ర పోషించిన `మర్దానీ` ప్రాంచైజీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు.
మహిళల అక్రమ రవాణా, కిడ్నాప్ లాంటి అంశాలతో రూపొందిన `మర్దానీ`, `మర్దానీ-2` చిత్రాలు మంచి విజయం సాధించాయి. శివానీ శివాజీ రాయ్ పాత్రలో రాణీ నటన ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యశ్ రాజ్ ఫిలింపై ఈ రెండు భాగాల్ని కూడా గోపీ పుత్రన్ తెరకెక్కించారు. ఆ మధ్య ఈ ప్రాంచైజీ నుంచి మూడో భాగాన్ని ప్రకటించి పట్టాలెక్కించారు. కొంత కాలంగా సెట్స్ లో ఉన్న సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.
ఈ చిత్రాన్ని 2026 లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ యశ్ రాజ్ ఫిలింస్ ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. `తొలి భాగం విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ ఈ పోస్ట్ పెట్టింది. తదుపరి అధ్యాయం మరింత ఆసక్తికరంగా ఉంటుందని రాసుకొచ్చారు. దీనికి సంబంధించి రాణీ ముఖర్జీ స్పందించింది. `మర్దానీ 3` ఎలా ఉంటుందోనని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాను. మరింత వైవిథ్యంగా ఉంటుందని చెప్పగలను.
మరోసారి శివానీ పాత్ర పోషిస్తుందన్నందుకు సంతోషంగా ఉంది` అని అన్నారు. దీంతో సినిమా రిలీజ్ బాగా ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉన్నా? 2026లో రిలీజ్ అంటే అప్పటివరకూ సినిమా షూటింగ్ ...పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంటుందా? అన్న సందేహం వస్తుంది. సినిమా రిలీజ్ చేయడానికి ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారని నెటిజనులు సోషల్ మీడియా వేదికగా యశ్ రాజ్ సంస్థను ప్రశ్నిస్తున్నారు. మరి ఆలస్యానికి కారణం ఏంటో చెబుతారా? లేదా? అన్నది చూడాలి.