మూవీ రివ్యూ : మత్తు వదలరా-2
ఐదేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా.. మత్తు వదలరా. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా.. పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రమది.
'మత్తు వదలరా-2' మూవీ రివ్యూ
నటీనటులు: శ్రీ సింహా కోడూరి-సత్య-ఫరియా అబ్దుల్లా-సునీల్-వెన్నెల కిషోర్-రోహిణి-ఝాన్సీ తదితరులు
సంగీతం: కాలభైరవ
ఛాయాగ్రహణం: సురేష్ సారంగం
నిర్మాత: చిరంజీవి (చెర్రీ)
రచన-దర్శకత్వం: రితేష్ రాణా
ఐదేళ్ల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై మంచి విజయం సాధించిన సినిమా.. మత్తు వదలరా. కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా.. పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన చిత్రమది. ఈ సినిమాతో మెప్పించిన రితేష్ రాణా.. మళ్లీ ఇప్పుడు అదే టీంతో సీక్వెల్ తీశాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మత్తు వదలరా-2' విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
డెలివరీ బాయ్స్ గా పని చేసే బాబు మోహన్ (శ్రీ సింహా).. బుజ్జి (సత్య) ఓ డ్రగ్ రాకెట్ కేసులో ఇరుక్కుని తమ ఉపాధి కోల్పోయాక.. లంచాలు ఇచ్చి నేరాలను ఛేదించడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ టీం 'హి'లో ఉద్యోగాలు సంపాదిస్తారు. అక్కడ కిడ్నాప్ కేసులను ఛేదించడంలో నైపుణ్యం సంపాదించి.. కిడ్నాపర్ల నుంచి రికవరీ చేసే డబ్బుల్లో కొంత నొక్కేయడం ద్వారా ఆర్థికంగా బలపడే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలో ఒక అమ్మాయి కిడ్నాప్ కేసును అనధికారికంగా డీల్ చేయడం ద్వారా రూ.2 కోట్లు కొట్టేయడానికి బాబు-బుజ్జి ప్లాన్ చేస్తారు. కానీ ఎవరో చేసిన కుట్రలో భాగంగా వీళ్లిద్దరూ ఓ హత్య కేసులో చిక్కుకుంటారు. ఇంతకీ హత్యకు గురైన వ్యక్తి ఎవరు.. అతణ్ని చంపింది ఎవరు.. వీళ్లిద్దరినీ ఎందుకు ఇరికించారు.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెర మీదే చూసి తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
మత్తువదలరా.. ఐదేళ్ల కిందట తెలుగు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచిన చిత్రం. ఓవైపు నవ్విస్తూనే.. ప్రేక్షకులు ఊహించని ట్విస్టులతో థ్రిల్ చేసిందా సినిమా. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే.. ప్రేక్షకులు ఎంతో ఆశిస్తారు. ఇందులో పార్ట్-1కు మించిన ఫన్.. థ్రిల్స్.. బిగితో సాగే కథ ఉంటుందని అనుకుంటారు. టీజర్.. ట్రైలర్ చూస్తే అంచనాలను అందుకునే సినిమాలాగే కనిపించింది 'మత్తు వదలరా-2'. కానీ సినిమా ఒకింత నిరాశకు గురి చేస్తుంది. కథ పరంగా పార్ట్-1లో ఉన్న బిగి.. కొత్తదనం ఇందులో కనిపించదు. మళ్లీ డ్రగ్స్ నేపథ్యంలోనే కథను అల్లినప్పటికీ.. మొదటి భాగంలోలా ఆశ్చర్యపరిచేలా ఈసారి కాన్సెప్ట్ ను డీల్ చేయలేకపోయాడు రితేష్ రాణా. చెప్పుకోవడానికి మలుపులు చాలా ఉన్నా.. అవి తెర మీద అనుకున్నంతగా పేలలేదు. కామెడీయే లక్ష్యంగా పూర్తిగా నాన్ సీరియస్ గా కథను నడిపించడం.. సీన్లు మరీ ఇల్లాజికల్ గా సాగడంతో ప్రేక్షకులు సినిమాను సీరియస్ గా తీసుకునే అవకాశం లేకపోయింది. ఐతే ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో ఫెయిలైన ఈ సినిమా.. నవ్వించడంలో మాత్రం విజయవంతమైంది. ఆ బాధ్యతను ప్రధానంగా కమెడియన్ సత్యనే తీసుకున్నాడు. తన పాత్రతో కనెక్ట్ అయితే చాలు.. టైంపాస్ కావడం కష్టమేమీ కాదు. కానీ కామెడీకి మించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.
'రంగబలి' అనే ఫ్లాప్ సినిమాలో కూడా తన టిపికల్ కామెడీతో అదరగొట్టాడు సత్య. తన కామెడీ టైమింగ్ కు సరిపోయే పాత్ర రాసి.. మంచి వన్ లైనర్స్ తన నోటికందిస్తే చాలు.. తనదైన టైమింగ్ తో ప్రేక్షకులకు నవ్వులు పంచుతాడు సత్య. 'మత్తు వదలరా'లో అతడికి అలాంటి పాత్రే పడింది. ఈ సినిమా తర్వాత రితేష్ రాణా తీసిన 'హ్యాపీ బర్త్ డే' సినిమాగా నిరాశపరిచినా.. అందులో కూడా సత్య కామెడీ వరకు బాగా క్లిక్ అయింది. సత్య కామెడీ టైమింగ్ కు సరిపోయేలా ట్రెండీ.. స్పూఫ్ తరహా కామెడీ రాయడంలో రితేష్ రాణాకు ఉన్న నైపుణ్యం 'మత్తువదలరా-2'కు పెద్ద ప్లస్అ యింది. ఈసారి రైటర్ కమ్ డైరెక్టర్ రితేష్ రాణా.. కథ సహా మిగతా అంశాలన్నింటికంటే సత్య పాత్రను ఎలివేట్ చేయడం మీదే తన ఫోకస్ అంతా పెట్టాడా అనిపిస్తుంది. అతను రాసిన ట్రెండీ వన్ లైనర్స్ కు తన మేనరిజమ్స్.. టిపికల్ కామెడీ టైమింగ్ జోడించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు సత్య. ఓవైపు సీరియస్ గా కథ నడుస్తున్నా.. దాని గురించి పట్టించుకోవడం మానేసి సత్య పాత్ర వేసే వేషాలు చూసి నవ్వుకునే పరిస్థితి ఉండడం 'మత్తు వదలరా-2'కు ప్లస్సే కాదు మైనస్ కూడా. సత్య కామెడీ మినహా సినిమాలో చెప్పుకోదగ్గ ప్రత్యేకతలేమీ లేవు. ప్రేక్షకులను కన్విన్స్ చేయని ట్విస్టులు.. నాన్ సీరియస్ గా సాగే కథాకథనాలు 'మత్తు వదలరా-2'ను సాధారణమైన సినిమాగా మార్చాయి.
'మత్తు వదలరా'లో కూడా ప్రధాన పాత్రధారుల పాత్రలు కామెడీగా.. అల్లాటప్పాగా సాగినా.. అందులో కథ మాత్రం మంచి బిగితో సాగుతుంది. డ్రగ్స్ కాన్సెప్ట్ ను డీల్ చేసిన విధానం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కానీ 'మత్తు వదలరా-2'లో మాత్రం ఆ ఇంటెన్సిటీ ఎంతమాత్రం కనిపించదు. హై ప్రొఫైల్ కేసులను డీల్ చేసే 'హి' టీంలోకి ఆవారాగాళ్లయిన హీరో అతడి ఫ్రెండు చేరడంతోనే అక్కడి వ్యవహారమంతా నాన్ సీరియస్ గా మారిపోతుంది. వీళ్లు చాలదన్నట్లు ఉన్నతాధికారి పాత్రలో సునీల్ సైతం మరీ కామెడీగా కనిపించడంతో అక్కడ జరిగే తంతంతా మొక్కుబడి వ్యవహారంలా కనిపిస్తుంది. దీని వల్ల హీరో.. తన ఫ్రెండు మర్డర్ కేసులో చిక్కుకున్నా.. వాళ్లను ఓ పథకం ప్రకారం ఇరికించినట్లు చూపించినా.. 'హి' టీం అంతా వాళ్ల వెంట పడుతున్నా.. టెన్షన్ గా అనిపించదు. పీకల్లోతు ఇరుక్కున్నట్లు కనిపించాక కూడా హీరో తన ఫ్రెండు తాపీగా ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తుంటారు. ఏం కావాలంటే అది చేేసేస్తుంటారు. సన్నివేశాలు ఇలా సాగుతున్నపుడు ఇక ఉత్కంఠ ఏముంటుంది.. ఏదైనా ట్విస్ట్ వచ్చినా థ్రిల్లవడానికి అవకాశమెక్కడుంది? ప్రథమార్ధంలో కథలో ట్విస్ట్ రావడానికి ముందు.. తర్వాత కూడా సత్య కామెడీనే ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుంది. కొన్ని సీన్లలో కామెడీ బాగా పేలడంతో.. కొన్ని రేసీ సీన్లతో ప్రథమార్ధం మంచి టెంపోతో సాగుతుంది.
ఇక వెన్నెల కిషోర్ రంగ ప్రవేశంతో రెండో అర్ధం ఇంకా వేగం అందుకుంటుందని ఆశిస్తే.. ఆశ్చర్యకరంగా తన ఎపిసోడ్ కథనానికి బ్రేకులు వేసింది. సినిమా హీరో యువగా కిషోర్ యాక్ట్స్ పెద్దగా నవ్వించవు. లెంగ్తీగా సాగే తన ఎపిసోడ్ నవ్వించకపోగా.. విసిగిస్తుంది. కిషోర్ పాత్ర చివరికి సీరియస్ గా ముగియడం నిరాశ పరుస్తుంది. ఇక్కడ్నుంచి ఒకదాని వెంట ఒకటి ట్విస్టులు వస్తూనే ఉంటాయి కానీ.. ఏవీ థ్రిల్లింగ్ గా మాత్రం అనిపించవు. అసలు కుట్రధారి ఎవరు అనే విషయాన్ని చూపిస్తున్నపుడు కూడా ప్రేక్షకుల్లో పెద్దగా ఎగ్జైట్మెంట్ ఉండదు. కథ.. ట్విస్టులు అన్నీ తోచినట్లు రాసుకుంటూ వెళ్లిపోయారు తప్ప.. వాటిని కన్విన్సింగ్ గా.. ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోవడం వల్ల 'మత్తు వదలరా-2' అంత ప్రత్యేకమైన సినిమాగా అనిపించదు. 'మత్తు వదలరా' తరహాలోనే ఇందులో కూడా సీరియల్స్ మీద సెటైర్లు వేస్తూ ఒక ట్రాక్ నడిపించారు కానీ.. అది పెద్దగా పేలలేదు. కేవలం సత్య కామెడీ మీద సినిమా సోసోగా నడిచిపోయింది కానీ.. 'మత్తు వదలరా'కు ఇది అస్సలు మ్యాచ్ చేసే సినిమా కాదు. కథాకథనాల విషయంలో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ట్రెండీగా సాగే కామెడీ కోసం యువ ప్రేక్షకులు 'మత్తు వదలరా-2'పై ఓ లుక్కేయొచ్చు.
నటీనటులు:
శ్రీ సింహా పాత్ర 'మత్తు వదలరా' తరహాలోనే సాగడంతో నటన కూడా అందుకు తగ్గట్లే సాగింది. ఈ పాత్రకు అతను యాప్ట్ అనిపించాడు. తొలి సినిమాతో పోలిస్తే అనుభవం మీద లుక్.. నటన.. డైలాగ్ డెలివరీ మెరుగు పడ్డాయి. సినిమాలో పేరుకు తనే హీరో కానీ.. అసలైన హీరో మాత్రం సత్యనే. మిగతా ఆర్టిస్టులందరినీ పక్కకు నెట్టేసి అతను చెలరేగిపోయాడు. ప్రతి సీన్లోనూ తన హావభావాలు.. డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయి. సునీల్ లాంటి ఒకప్పటి ఎలైట్ కమెడియన్ ఇందులో ఉండి కూడా ఎక్కడా నవ్వించలేకపోయాడు కానీ.. సత్య మాత్రం బోలెడన్ని నవ్వులు పంచాడు. ఫరియా అబ్దుల్లా పాత్ర సోసోగా అనిపిస్తుంది. తన నటన ఓకే. గత సినిమాలతో పోలిస్తే ఇందులో కొంచెం ట్రెండీగా.. బోల్డుగా కనిపించింది. రోహిణి కొంచెం భిన్నమైన పాత్రే చేసింది కానీ.. అదంత ఇంపాక్ట్ వేయలేదు. ఆకాష్ పాత్రలో అజయ్ బాగానే చేశాడు. రాజా చెంబ్రోలు పాత్ర గజిబిజిగా అనిపిస్తుంది. తన నటన ఓకే.
సాంకేతిక వర్గం:
పాటలు లేని ఈ సినిమాలో కాలభైరవ తన నేపథ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ పార్ట్ మాదిరే ట్రెండీ మ్యూజిక్ తో సినిమాను ముందుకు నడిపించాడు. సినిమా నడతకు తగ్గట్లుగా కొంచెం క్రేజీగా సాగుతుంది స్కోర్. సురేష్ సారంగం ఛాయాగ్రహణం బాగానే సాగింది. నిర్మాణ విలువలు యాప్ట్ అనిపిస్తాయి. 'మత్తు వదలరా'తో ఆశ్చర్యపరిచిన రితేష్ రాణా.. అంతటి బిగిని ఈ సినిమాలో చూపించలేకపోయాడు. తన నరేషన్ కామెడీకి బాగానే సూటవుతోంది కానీ.. అసలు కథను చెప్పడంలో మాత్రం మైనస్ అవుతోంది. విడివిడిగా చూస్తే కామెడీ సీన్లు బాగా అనిపిస్తాయి కానీ.. అతను కథను ఆసక్తికరంగా..బిగితో చెప్పలేకపోయాడు. 'హ్యాపీ బర్త్ డే'తో పోలిస్తే మెరుగైన సినిమా తీశాడు కానీ.. 'మత్తు వదలరా'ను మాత్రం అతను మ్యాచ్ చేయలేకపోయాడు. రచయితగా.. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.
చివరగా: మత్తు వదలరా- 2.. కొన్ని నవ్వుల కోసం
రేటింగ్- 2.75/5