ఫ్లైట్ లో నీళ్లు అనుకుని విష ద్రవం తాగి.. టీమిండియా క్రికెటర్ ఆస్పత్రి పాలు
దేశవిదేశీ పర్యటనల్లో ఎన్నోసార్లు విమానం ఎక్కిన అతడు ఇలాంటి అనుభవం ఎదుర్కొంటాడని ఎవరూ ఊహించి ఉండరు
''ప్రయాణంలో అపరిచితులు ఇచ్చిన పదార్థాలు తినొద్దు''.. ''తెలియని వ్యక్తులతో అతిగా మాట్లాడవద్దు''.. ''మీ వస్తువులు భద్రం''.. ఇవీ సాధారణ ప్రయాణికులకు విమాన, రైల్వే, బస్ సర్వీస్ అందించే సంస్థలు చేసే హెచ్చరికలు.. మత్తులో ముంచి విలువైన వస్తువులు కాజేస్తారనే ఉద్దేశంలో ఇలాంటివి జారీ చేస్తుంటారు. సహజంగా సాధారణ ప్రయాణికులు వీటిపై అవగాహన కలిగి ఉంటారు. కానీ, అతడు అంతర్జాతీయ క్రికెటర్.. అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ లో ఓ జట్టుకు కెప్టెన్.. దేశవాళీ క్రికెట్ లో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న బ్యాట్స్ మన్.. మంచి ఓపెనర్.. ప్రస్తుత సీజన్ లో బాగా రాణిస్తే టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు బాగా ఉన్న క్రికెటర్.. అలాంటి ఆటగాడు అనూహ్య పరిస్థితుల్లో చిక్కుకున్నాడు. దేశవిదేశీ పర్యటనల్లో ఎన్నోసార్లు విమానం ఎక్కిన అతడు ఇలాంటి అనుభవం ఎదుర్కొంటాడని ఎవరూ ఊహించి ఉండరు.
మయాంక్ అనూహ్యంగా..
భారత్ కు 21 టెస్టులాడిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ప్రస్తుతం రంజీల్లో కర్ణాటక జట్టు కెప్టెన్ అయిన అతడు.. విమానం ఢిల్లీ వెళ్తూ ఆస్పత్రి పాలయ్యాడు. కర్ణాటక జట్టు త్రిపుర రాజధాని అగర్తలాలో మ్యాచ్ ముగిశాక ఢిల్లీ ప్రయాణమైంది. అయితే, కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్ లో ఉంచిన ద్రావకాన్ని నీళ్లు అనుకుని తాగిన మయాంక్.. ఆ తర్వాత తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. అది హానికార ద్రవం కావడంతో మయాంక్ నోట్లో ఇబ్బంది మొదలైంది. నోరు వాచిపోయి బొబ్బలు లేచి మాట రాలేదు. వెంటనే విమానాన్ని ఆపి హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం మయాంక్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై అతడి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వెనక్కువచ్చిన విమానం..
కర్ణాటక జట్టు ఇండిగో విమానంలో అగర్తలా నుంచి ఢిల్లీ బయల్దేరింది. అయితే, మయాంక్ అని పేరు చెప్పకుండా.. ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్యం కోసం ఫ్లైట్ వెనక్కి వచ్చిందని ఓ ప్రకటనలో తెలిపింది. కారణాలు ఏమిని చెప్పలేదు. కాగా, కర్ణాటక తరఫున ఇటీవల త్రిపురతో రంజీ మ్యాచ్ ఆడిన మయాంక్.. 51, 17 పరుగులు చేశాడు. ఇప్పుడు విష ద్రవం తాగి అస్వస్థుడైన అతడు ఫిబ్రవరి 2న రైల్వేస్ మ్యాచ్ ఆడడం లేదు. కాగా, మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రి నుంచే తన మేనేజర్ ద్వారా మయాంక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ త్రిపుర ఎస్పీ కిరణ్ కుమార్ పలు విషయాలను వెల్లడించారు.