మహేష్ - రాజమౌళి: మాట్లాడుకునే టైమయ్యింది!
ఇక మొత్తానికి ఇప్పుడు మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎదురుపడి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి మహేష్ బాబుతో సినిమాను ఎప్పుడు మొదలుపెడతాడా సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా సినిమా అంతకు మించి అనేలా ఉంటుంది అని చెప్పవచ్చు. అయితే ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈపాటికే అసలు పనులు మొదలు కావాలి. కానీ స్క్రిప్ట్ విషయంలో అలాగే ప్రీ ప్రొడక్షన్ విషయంలో జక్కన్న ఈసారి ఎక్కువ సమయం తీసుకుంటూ ఉన్నాడు.
ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్కుతో కనిపిస్తాడు అని అర్థమవుతుంది. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా మహేష్ బాబు ఇప్పటికే రాజమౌళి సలహాల మేరకు కొన్ని మార్పులు చేస్తూ ఉన్నాడు. ఇక రెగ్యులర్ గా ఇద్దరి మధ్యలో ఫోన్ కాల్స్ లైవ్ కాల్స్ ద్వారా ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుని చాలా రోజులైందట.
ఇక మొత్తానికి ఇప్పుడు మహేష్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎదురుపడి మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం మీటింగ్ కు టైమ్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. పూర్తి ప్రణాళికతో పాటు ప్రీ ప్రొడక్షన్ ప్లాన్స్ గురించి కూడా జక్కన్న మహేష్ బాబుతో చెప్పబోతున్నాడు. అలాగే వీరితోపాటు నిర్మాత కూడా చర్చలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబు ఇకనుంచి పూర్తిస్థాయిలో రాజమౌళి ప్రాజెక్టుతోనే బిజీ కాబోతున్నాడు.
ప్రస్తుత ప్లాన్ ప్రకారమైతే ఈ సినిమా షూటింగ్ కోసమే దాదాపు ఏడాది వరకు సమయం పట్టే అవకాశం ఉంది. మహేష్ కూడా భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఏమీ ఆలోచించడం లేదు. ముందుగా SSMB29 కోసం ఏదైనా చేయాలనే కసితో ఉన్నాడు. కెరీర్ లోనే అతిపెద్ద ప్రాజెక్టు కావడంతో మహేష్ తన లుక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు.
ఇక ఈ సినిమా కోసం దాదాపు 1500 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. అలాగే నెట్ ఫ్లిక్స్ కూడా వీరితోపాటు ప్రొడక్షన్లో భాగం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలపై కూడా రాజమౌళి అధికారికంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయబోతున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ అయితే సమ్మర్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది.