లెజెండరీ నటి బయోపిక్ వాయిదా!
ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అలనాటి అందాల బాలీవుడ్ తార మీనా కుమారి బయోపిక్ కి రంగం సిద్దమవుతోన్న సంగతి తెలిసిందే. ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ ఏడాది అక్టోబర్ లో చిత్రాన్ని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఇప్పుడీ సినిమా పట్టాలెక్కించడం వాయిదా పడింది.
వచ్చే ఏడాది వరకూ ఈ సినిమా ప్రారంభించడం వీలుపడదని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. మీనా కుమారి కథలో ఇంకా లోతైన విశ్లేషణ అవసరమని భావించిన యూనిట్ కంగారు పడి చేయడం కంటే సమయం తీసుకుని చేస్తేనే ఉత్తమం అని భావిస్తోంది.దీనిలో భాగంగా మీనా కుమారి గురించి ఇంకా తెలు సుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, వాటన్నింటిని స్క్రిప్ట్ లో జోడించడానికి ఎలా లేదన్నా ఆరేడు నెలలు సమయం పడుతుందని మేకర్స్ భావిస్తున్నారుట.
ఈ నేపథ్యంలో సినిమా ప్రారంభోత్సవం వాయిదా వేస్తున్నారు. `ప్రస్తుతం స్క్రిప్ట్ ముగింపు దశలో ఉంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. కానీ కథకి ఇంకా లోతైన విశ్లేషణ అవసరం. అందుకే వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నామని` తెలిపారు. ఇందులో మీనాకుమారి పాత్రకు కృతి సనన్ ఎంపిక చేసారు. ఆమెపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించారు. మీనా పాత్రకు అమ్మడు పక్కాగా సూట్ అవ్వడంతో లాక్ చేసారు.
ఈ సినిమా ప్రారంభోత్సవం కోసం కృతి ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నట్లు తెలిపింది. ప్రారంభానికి ముందే ఆ పాత్రకు సంబంధించి అన్ని రకాలుగా సన్నధం అవుతున్నట్లు తెలిపింది. మీనా కుమారి పాత్రలో ఆత్మ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నానని, అప్పట్లో ఆమె ఎలా ఉండేవారు? ఎలా నటించేవారు? వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నట్లు తెలిపింది.