మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఆ సినిమాపైనే..!

మెగా ఫ్యామిలీకి లాస్ట్ ఇయర్ బాగా కలిసొచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

Update: 2025-01-21 03:01 GMT

మెగా ఫ్యామిలీకి లాస్ట్ ఇయర్ బాగా కలిసొచ్చిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. చిరంజీవిని 'పద్మవిభూషణ్' వరించడం, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కడం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, చెన్నై వేల్స్ యూనివర్శిటీ నుంచి రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్ పొందడం, నాగబాబుకు ఏపీ మంత్రి వర్గంలో చోటు ఖరారవ్వడం.. ఇవన్నీ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచాయి. కానీ సినిమాల పరంగా మాత్రం వారు చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు.

మెగా హీరోలు గత కొన్నాళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాలు అందుకోలేకపోతున్నారు. 'భోళా శంకర్'తో చిరంజీవి భారీ డిజాస్టర్ చవి చూశారు. మెగా మేనమామ-మేనల్లుడు పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ తొలిసారిగా కలిసి నటించిన 'బ్రో' సినిమా ఆశించిన సక్సెస్ సాధించలేదు. వరుణ్ తేజ్ సోలోగా హిట్టు కొట్టి చాలా ఏళ్లైంది. 'గని', 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వాలెంటైన్', 'మట్కా' సినిమాలు దారుణంగా ఫెయిల్ అయ్యాయి. 'ఉప్పెన' తర్వాత వైష్ణవ్ నటించిన ఒక్క సినిమా కూడా హిట్టవ్వలేదు. చివరగా వచ్చిన 'ఆదికేశవ' డిజాస్టర్ అయింది.

ఇక రామ్ చరణ్ సోలోగా సక్సెస్ సాధించి ఏళ్లు గడిచిపోయింది. తన తండ్రితో ఫస్ట్ టైం పూర్తి స్థాయిలో స్క్రీన్ షేర్ చేసుకున్న 'ఆచార్య' మూవీ డిజార్డర్ గా మారింది. RRR స్టార్ డమ్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో 'గేమ్ ఛేంజర్' సినిమాతో చెర్రీ సోలోగా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి చూపించాలని మెగా అభిమానులు బలంగా కోరుకున్నారు. కానీ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం కూడా తీవ్ర నిరాశ పరిచింది. దీంతో నెట్టింట యాంటీ ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది.

'గేమ్ ఛేంజర్' చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఓపెనింగ్ డే భారీ వసూళ్లను రాబట్టినట్లుగా గొప్పగా చెప్పుకున్నారు. రెండో రోజు నుంచి మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ వీకెండ్ వరకూ సోషల్ మీడియాలో డిపెండ్ చేసుకుంటూ వచ్చిన ఫ్యాన్స్ సైతం.. ఆ తర్వాత మెల్లిమెల్లిగా రిజల్ట్ ను యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఎన్నో హోప్స్ పెట్టుకున్న సినిమా డిజాస్టర్ అయిందనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో రాబోయే 'విశ్వంభర' మూవీ ఈ గాయాన్ని మర్చిపోయేలా చేస్తుందని భావిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ "విశ్వంభర". సంక్రాంతికి ఈ సినిమానే విడుదల అవ్వాల్సింది. కానీ రామ్ చరణ్ మూవీ కోసం వాయిదా వేసుకున్నారు. సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధిస్తే, మళ్ళీ సెలబ్రేషన్స్ మోడ్ లోకి వచ్చేయొచ్చని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ సినిమాకి సోషల్ మీడియాలో డ్యూటీ చెయ్యాలని నిర్ణయించుకున్నారు.

నిజానికి మెగా ఫ్యాన్స్ కోసం 'విశ్వంభర'తో పాటుగా 'హరి హర వీరమల్లు' సినిమా కూడా రాబోతోంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాతలు ప్రకటించారు కూడా. కానీ పవన్ కల్యాణ్ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం, ఈ గ్యాప్ లో ఆ డేట్ మీద మరికొన్ని ఇతర సినిమాలు కర్చీఫ్స్ వేస్తుండటంతో.. వీరమల్లు రాకపై అందరిలో సందేహాలు మొదలయ్యాయి. అందుకే చిరంజీవి చిత్రం మీదనే ఇప్పుడు అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సస్ సాధిస్తుందో వేచి చూడాలి.

ఇకపోతే పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న వీరమల్లు, OG.. సాయి దుర్గ తేజ్ 'SYG - సంబరాల ఏటిగట్టు' సినిమాలు ఈ ఏడాదే విడుదల కాబోతున్నాయి. మరోవైపు రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు సినిమా షూటింగుతో బిజీగా ఉన్నారు. మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ ఒక హార్రర్ కామెడీ సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇవి కాకుండా మెగా హీరోలు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. వారిలో చిరంజీవి బ్యాక్ టూ బ్యాక్ అనౌన్స్ మెంట్స్ తో రాబోతున్నారు.

Tags:    

Similar News