'పుష్ప 2' ట్రైలర్‌ను లైట్ తీసుకున్న మెగా హీరోలు..?

ఆదివారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా వేదికగా గ్రాండ్ గా జరిగిన మాసివ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ ట్రైలర్ ను లాంచ్ చేసారు.

Update: 2024-11-18 09:27 GMT

యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ''పుష్ప 2: ది రూల్‌'' ట్రైలర్‌ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం బీహార్ రాజధాని పాట్నా వేదికగా గ్రాండ్ గా జరిగిన మాసివ్ ఈవెంట్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' సీక్వెల్ ట్రైలర్ ను లాంచ్ చేసారు. ఇది అన్ని వర్గాలవారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం మీడియాలో, సోషల్‌ మీడియాలో పుష్పగాడి రూల్‌ గురించే చర్చలు జరుగుతున్నాయి. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న ట్రెయిలర్ పై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ 'మెగా హీరోలు' మాత్రం ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు.

దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ఎక్స్ లో ''పుష్ప 2: ది రూల్‌'' గురించి పోస్ట్ పెడుతూ ''పాట్నాలో వైల్డ్‌ఫైర్‌ స్టార్ట్ అయింది.. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న పేలుడు సంభవించబోతోంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నా పుష్పా'' అని పేర్కొన్నారు. ''ఇది నిజంగా వైల్డ్‌ఫైర్‌. అల్లు అర్జున్‌, సుకుమార్‌లు మరోసారి చేసి చూపించారు. ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. స్టాండర్స్ ఖచ్చితంగా ఎక్కువే. బిగ్‌ స్క్రీన్‌పై ఎక్స్ పీరియన్స్ చేయడానికి వేచి చూస్తున్నా'' అని అనిల్‌ రావిపూడి ట్వీట్ చేసారు. ''పుష్ప-2 ట్రైలర్ భారీగా, పవర్‌తో నిండిపోయింది. మరో బ్లాక్‌బస్టర్‌ కోసం మొత్తం టీమ్‌కి శుభాకాంక్షలు'' అని కన్నడ హీరో రిషబ్‌ శెట్టి పోస్ట్ పెట్టారు.

''పుష్ప-2 ట్రైలర్‌ అంతటా బ్లాక్‌బస్టర్ అని వ్రాయబడింది. ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఇంటెన్సిటీ, స్వాగ్.. డైరక్టర్ సుకుమార్ ప్రతి ఫ్రేమ్‌లోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. దేవిశ్రీ ప్రసాద్ ఎలెక్ట్రిఫైయింగ్ బీజీఎమ్ అందించారు. టీమ్‌ మొత్తానికి నా శుభాకాంక్షలు'' అని డైరెక్టర్ బాబీ కొల్లు రాసుకొచ్చారు. ''వైల్డ్‌ఫైర్‌.. తిరుగుబాటును విప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగి వచ్చాడు. అప్పటికంటే మరింత బిగ్గరగా, ఉగ్రంగా, ఘోరంగా ఉన్నాడు. పవర్‌హౌస్ టీమ్ కు శుభాకాంక్షలు. డిసెంబర్ 5 నుండి రూల్ చూసేందుకు వేచి ఉండలేకపోతున్నా'' అని ప్రశాంత్‌ వర్మ పేర్కొన్నారు.

''ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా'' దర్శకుడు బుచ్చిబాబు సనా పోస్ట్ పెట్టగా.. అల్లు అర్జున్ ఫుల్ స్వాగ్ తో 'పుష్ప 2: ది రూల్‌' ట్రైలర్ మరో లెవెల్‌లో ఉంది. అస్సలు తగ్గేదేలే అని డైరెక్టర్ అజయ్ భూపతి అన్నారు. హరీశ్‌ శంకర్‌ ట్వీట్ చేస్తూ.. ''ప్రతి ఫ్రేమ్‌ మీ కృషిని తెలియజేస్తుంది. పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ (Allu Arjun) తపన కనపడుతోంది. మీరు దీనికోసం పడిన కష్టం. మీ శ్రమ, దీని కోసం వెచ్చించిన సమయం అన్నీ సినిమాపై మీకున్న ప్రేమకు స్పష్టమైన సాక్ష్యాలు. హ్యాట్సాఫ్ డియర్‌ అల్లు అర్జున్'' అని 'పుష్ప 2' ట్రైలర్ ను ప్రశంసించారు.

''ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక వైల్డ్ ఫైర్ లా ఉన్నాడు. భారతదేశాన్ని జయించాలనే తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. ఈ అగ్నికి ఇంధనం సుకుమార్. 'పుష్ప 2' బాక్సాఫీస్‌ని శాసించబోతోంది'' అని డైరెక్టర్ మెహర్ రమేష్ పోస్ట్ చేసారు. ''ట్రైలర్ ప్యూర్ మ్యాడ్ నెస్ ఇస్తోంది. ఇది ఒక మంచు ముక్క మాత్రమే. స్టోర్ లో ఇంకా చాలా ఉన్నాయి. గ్లోబల్ సెన్సేషనల్ కు తక్కువ ఏమీ లేదు. డిసెంబర్ 5న ఈ చిత్రాన్ని ఎక్స్ పీరియన్స్ చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అని హను రాఘవపూడి ట్వీట్ పెట్టారు.

శర్వానంద్, సుధీర్ బాబు, కిరణ్ అబ్బవరం, ఆది సాయి కుమార్, అల్లు శిరీష్ వంటి టాలీవుడ్ యువ హీరోలు కూడా 'పుష్ప 2: ది రూల్‌' ట్రైలర్ పై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. వీరందరికీ అల్లు అర్జున్ పేరు పేరునా సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్‌ చెబుతూ వస్తున్నారు. అయితే ఇంటర్నెట్ ను ఊపేస్తున్న ఈ ట్రైలర్ పై ఇంతవరకూ ఒక్క మెగా హీరో కూడా స్పందించలేదు. చిరంజీవి, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల, సుష్మిత కొణిదెల.. ఇలా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ పోస్టులు పెట్టలేదు. ఇది మామూలు సినిమా అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ, 'పుష్ప 2' చాలా ప్రత్యేకమైన చిత్రం కాబట్టే అందరూ ప్రత్యేకంగా చూస్తున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2: ది రూల్‌' చిత్రంపై అంచనాలు, హైప్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాట్నాలో నార్త్ ఆడియన్స్ నుంచి బన్నీకి ఎలాంటి స్వాగతం లభించిందో మనం చూసాం. ఏ హిందీ హీరో ఈవెంట్ కు కూడా ఈ స్థాయిలో జనాలు రాలేదు. ఇక ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియాని రూల్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధిస్తుందని భావిస్తున్నాయి. ట్రైలర్ వచ్చిన తర్వాత వెయ్యి కోట్ల క్లబ్ ను ఈజీగా దాటుతుందని ఫిక్స్ అయిపోయారు. ఇదే జరిగితే బన్నీకే కాదు, తెలుగు చలన చిత్ర పరిశ్రమకే ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. అలాంటి చిత్రంపై మెగా కాంపౌండ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

ఇటీవల కాలంలో అల్లు అర్జున్, మెగా హీరోల మధ్య సత్సంబంధాలు లేవనే విధంగా ప్రచారం సాగుతోంది. ఎన్నికల సమయంలో తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రా రెడ్డి ఇంటికి వెళ్లడం ఇరు వర్గాల మధ్య వివాదానికి కారణమైంది. అప్పటి నుంచి ఒకరికొకరు దూరంగానే ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. తన మనసులో ఏం లేదని 'అన్ స్టాపబుల్ 4' టాక్ షో వేదికగా బన్నీ పరోక్షంగా క్లారిటీ ఇచ్చేసారు. కాబట్టి ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్‌' ట్రైలర్ పై మెగా ఫ్యామిలీ స్పందిస్తే, మెగా అభిమానులందరూ ఏకం అయ్యే అవకాశం ఉంటుంది. మరి మెగా హీరోలు రాబోయే రోజుల్లో అల్లు అర్జున్‌ని మెచ్చుకుని సపోర్ట్ చేస్తారో లేదా 'పుష్ప 2' విషయంలో సైలెంట్ గానే ఉంటారో చూడాలి.

Tags:    

Similar News