6000 కోట్ల ఆస్తులతో దేశంలో అతిపెద్ద సినీకుటుంబం!
భారతదేశంలో అత్యంత విజయవంతమైన సినిమా కుటుంబాల్లో బచ్చన్ లు, కపూర్‌లు, ఖాన్‌లు, రోషన్‌లు, చోప్రాల పేర్లు వినిపిస్తుంటాయి
భారతదేశంలో అత్యంత విజయవంతమైన సినిమా కుటుంబాల్లో బచ్చన్ లు, కపూర్‌లు, ఖాన్‌లు, రోషన్‌లు, చోప్రాల పేర్లు వినిపిస్తుంటాయి. వీరంతా వేల కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు. అయితే టాలీవుడ్ లో అంతకుమించి అనేలా.. భారీ ఆస్తులు కలిగి ఉన్న ఒక అగ్ర సినీకుటుంబం గురించి దేశవ్యాప్తంగా ఎప్పుడూ చర్చ సాగుతోంది. ఆ కుటుంబంలో నలుగురు సూపర్ స్టార్లు ఉన్నారు. అరడజను యువహీరోలు ఉన్నారు. ఒక ప్రిన్సెస్ నటన సహా సినీనిర్మాణంలో కొనసాగుతున్నారు. అయితే అది ఏ కుటుంబం? అంటే అంతగా వెతకాల్సిన అవసరం లేదు. ది గ్రేట్ మెగా ఫ్యామిలీ గురించే ఇదంతా.
భారతదేశంలో అత్యంత విజయవంతమైన చలనచిత్ర కుటుంబంగా మెగా ఫ్యామిలీకి గుర్తింపు ఉంది. ఈ కుటుంబంలో నలుగురు సూపర్‌స్టార్లు చిరంజీవి- పవన్ కల్యాణ్- రామ్ చరణ్- అల్లు అర్జున్ ఉన్నారు. ఈ కుటుంబానికి ఐదు ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలు(బ్యానర్లు) ఉన్నాయి. ఈ కుటుంబంలో హీరోలందరి ఆస్తులు కలిపి రూ.6000 కోట్ల నికర విలువను చేరుకున్నాయని ఒక అంచనా.
భారతదేశంలో సినిమాలను ఫ్యామిలీ బిజినెస్ గా చూస్తారు. జయాపజయాల్లో రిస్కులు భరిస్తూ ఎదిగిన కుటుంబాల సాహసాలను అందరూ గుర్తిస్తున్నారు. టాలీవుడ్ లో మెగా- నందమూరి- అక్కినేని- దగ్గుబాటి కుటుంబాలు సినీపరిశ్రమలో భారీ సక్సెస్ తో అసాధారణ ఆస్తులు సంపాదించిన కుటుంబాలుగా ఖ్యాతి ఘడించాయి. కపూర్లు, చోప్రాలు, బచ్చన్ లు బాలీవుడ్ లో గొప్ప ముఖ విలువను క6లిగి ఉన్నారు. అత్యంత పాపులర్ ధనిక సినిమా కుటుంబాలలో వీరంతా ఉన్నారు. అయితే టాలీవుడ్ లో అజేయమైన చరిత్రను కలిగి ఉన్న మెగా కుటుంబం సాధించిన అసాధారణ విజయాల ముందు వారంతా చిన్నవారేనని పాపులర్ జాతీయ మీడియాలు కథనాలు వెలువరించాయి.
కొణిదెల-అల్లు కుటుంబాలను కలిపి మెగా ఫ్యామిలీ అని పిలుస్తారు. భారతదేశంలోని ప్రముఖ సినీ కుటుంబాలలో ఎంతో పాపులారిటీ ఉన్న కుటుంబం మెగా ఫ్యామిలీ. 1950 లలో నటుడు కం నిర్మాత అల్లు రామలింగయ్య ఈ కుటుంబంలో తొలి విజయానికి ఆద్యుడు. తెలుగు సినిమా స్వర్ణయుగంలో అత్యంత పాపులర్ నటుడుగా ఆయన ఒక చరిత్రకారుడు. రామలింగయ్య హాస్యనటుడిగా అద్భుతాలు చేసారు. నాడు పాపులర్ నిర్మాతలలో ఒకరిగా ఖ్యాతిని ఘడించారు. అల్లూ వారసుడు అల్లు అరవింద్ ఈ ఖ్యాతిని మరింత పెంచడంలో పెద్ద విజయం సాధించారు.
కీ.శే అల్లు రామలింగయ్య నలుగురు పిల్లలలో అరవింద్ సినీ నిర్మాతగా మారగా, కుమార్తె సురేఖ భారతీయ సినిమా చరిత్రలో అతిపెద్ద సూపర్ స్టార్‌లలో ఒకరిగా ఉన్న చిరంజీవిని వివాహం చేసుకున్నారు. సుప్రీంహీరో మెగాస్టార్ గా ఎదగడంలో అల్లు కుటుంబం అండదండలు చిరంజీవికి ఉన్నాయి. చిరు-సురేఖ దంపతుల వారసుడు రామ్ చరణ్ ఇప్పుడు దేశంలో బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్. అలాగే పరిశ్రమ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ వారసుడు అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా ఎదిగారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. చిరంజీవి సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసాధారణ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా ఎదిగారు. నాగేంద్ర బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఈ కుటుంబంలో చాలా మంది స్టార్లు తమ సత్తా చాటుతూ ఎదిగేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నిజానికి ఎక్కువ యాక్టివ్ స్టార్స్ ఉన్న కపూర్‌ల కంటే చాలా ఎక్కువ నికర ఆస్తులను కలిగి ఉందనేది ఒక సర్వే.
చిరంజీవి - పవన్ కల్యాణ్- రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఆ నలుగురు మెగా కుటుంబానికి మూల స్థంభాలుగా ఉన్నారు. అగ్రనిర్మాతగా అల్లు అరవింద్ మేనేజ్ మెంట్ స్కిల్స్, నిర్వహణా సామర్థ్యం వీరికి ప్రధాన బలం అనడంలో సందేహం లేదు. నిర్మాతగా రామ్ చరణ్ గొప్ప విజయాలను అందుకుంటున్నారు. మెగా కుటుంబం సంపదలో ఎక్కువ భాగం సృష్టికి ఆ ఐదుగురు ప్రధాన కారకులు. ఈ సభ్యులందరి నికర విలువను కలిపితే మెగా ఫ్యామిలీ నికర ఆస్తుల విలువ రూ.6000 కోట్లుగా ఉంటుందని ఒక అంచనా. ఈ కుటుంబానికి ఐదు చిత్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. గీతా ఆర్ట్స్, అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సినీనిర్మాణంలో ఉన్న పాపులర్ సంస్థలు.
తెలుగు సినిమా చరిత్రలో అగ్రకథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ - అల్లు అర్జున్ ఇద్దరూ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగు చిత్రసీమలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఆయన రాజకీయాల్లోను దూసుకెళుతున్నారు. వీరితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్‌గా ఉన్న దాదాపు అరడజను మంది యువహీరోలు మెగా కుటుంబంలో ఉన్నారు. భారతీయ సినిమా చరిత్రలో RRR, పుష్ప, సైరా నర్సింహా రెడ్డి, మగధీర, ఇంద్ర సహా అనేక బ్లాక్ బస్టర్ల సృష్టికి మెగా హీరోలు కారకులు. సంపదలను సృష్టించే మెగా నైపుణ్యం దేశంలోని ఏ ఇతర బడా సినీకుటుంబాలతో పోల్చినా అసాధారణమైనదని విశ్లేషిస్తున్నారు.