భోళాశంకర్ కాంట్రవర్సీ.. కూల్ చేసేందుకు మెహర్ రామేశ్ పాట్లు
ఒరిజినల్ వెర్షన్ వేదాళం సినిమాను పొగుడుతూ మరో ట్వీట్ చేశారు మెహర్
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'భోళా శంకర్' మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన అజిత్ 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా ఇది రూపొందింది. అయితే ఈ చిత్రం రిలీజ్ కు ముందే ఓ చిన్న వివాదంలో చిక్కుకుంది. తమిళ సినీ ప్రియుల ఆగ్రహానికి గురైంది. దీంతో దర్శకుడు మెహర్ రమేశ్ ఆ వివాదానికి ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నారు.
రీసెంట్ గా దర్శకుడు మెహర్ రమేశ్ భోళాశంకర్ గురించి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా 70 శాతం మార్పులు చేసి తెరకెక్కించినట్లు తెలిపారు. ఒరిజినల్ వెర్షన్ వేదాళం సినిమాలో క్రింజ్(చూడలేనటువంటి అనవసరమైన సీన్స్) ఎలిమెంట్స్ పది రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సన్నివేశాలను తీసేసి.. కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకున్నానని చెప్పారు.
ఇక ఈ కామెంట్స్ విన్న హీరో అజిత్ ఫ్యాన్స్.. మెహర్ రమేశ్ ఫై ఫుల్ గుస్సా అవుతున్నారు. 'నిన్ను ఎవరు రీమేక్ చేయమన్నారు?' అంటూ ఓ రేంజ్ లో మెహర్ పై సోషల్ మీడియాలో మండి పడుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న మెహర్ రమేశ్.. విడుదల ముందు ఈ వివాదం సరికాదని అర్థం చేసుకున్నారు. అజిత్ ఫ్యాన్స్ ను కూల్ గా ఉంచేందుకు తెలివిగా ఓ ట్వీట్ చేశారు.
ఒరిజినల్ వెర్షన్ వేదాళం సినిమాను పొగుడుతూ మరో ట్వీట్ చేశారు మెహర్. "2015లో వేదాళం సినిమా చూశాను. అది నాకు భలే నచ్చింది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న బలమైన బంధాన్ని డైరెక్టర్ శివ సార్ చూపించిన విధానం చాలా బాగుంది. దాన్ని తెలుగు ప్రేక్షకులందరికీ చూపించాలనుకున్నాను.
ఇదే కాదు 2009లోనూ అజిత్ సార్ హీరోగా నటించిన బిల్లా సినిమాను ప్రభాస్ తో చేశాను. మళ్లీ ఇప్పుడు అజిత్ సార్ నటించిన మరో సినిమాను తెలుగు సినీ ప్రియులకు చూపించేందుకు రెడీగా ఉన్నాను. మరో రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ కానుంది" అంటూ ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు మెహర్.
ఇక ఈ ట్వీట్ చూసిన అజిత్ ఫ్యాన్స్, తమిళ నెటిజన్లు.. మెహర్ పై కాస్త ట్రోలింగ్ తగ్గించినట్లు అర్థమవుతోంది. అజిత్ లాంటి హీరోపై, ఆయన నటించే సినిమాలపై కామెంట్స్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.