'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మూవీ రివ్యూ
నటీనటులు: అనుష్క-నవీన్ పొలిశెట్టి-జయసుధ-మురళీ శర్మ-తులసి-సోనియా దీప్తి-అభినవ్ గోమఠం-నాజర్ తదితరులు
సంగీతం: రధన్
నేపథ్య సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: నీరవ్ షా
నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి-వంశీకృష్ణారెడ్డి
రచన-దర్శకత్వం: మహేష్ బాబు
నవీన్ పొలిశెట్టి.. అనుష్క శెట్టిల ఆసక్తికర కలయికలో తెరకెక్కిన సినిమా 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. యువి క్రియేషన్స్ బేనర్లో యువ దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలే రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.
కథ:
అన్విత (అనుష్క శెట్టి) యూకేలో ఒక పెద్ద హోటల్లో మాస్టర్ చెఫ్ గా పని చేస్తుంటుంది. పెళ్లి పట్ల సదభిప్రాయం లేని ఆమె ఒంటరిగానే ఉండిపోవాలనుకుంటుంది. కానీ క్యాన్సర్ తో పోరాడుతూ చివరి రోజుల్లో ఉన్న అన్విత తల్లి మాత్రం తన కూతురికి ఒక తోడు అవసరమని అనుకుంటుంది. తల్లి మరణానంతరం అన్వితకు కూడా తనకో తోడు అవసరమనే భావన కలుగుతుంది. అందుకోసం పెళ్లి చేసుకోకుండా.. ఒక బిడ్డకు తల్లి కావాలని అనుకుంటుంది. అందుకోసం స్పెర్మ్ డోనర్ కోసం చూస్తున్న ఆమె దృష్టి.. స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు (నవీన్ పొలిశెట్టి) మీద పడుతుంది. అతడికి విషయం చెప్పకుండా ముందు తనెలాంటి వాడో తెలుసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి.. అన్వితతో ప్రేమలో పడతాడు సిద్ధు. ఇంతలో అన్విత అసలు విషయం చెబుతుంది. అప్పుడు సిద్ధు ఎలా స్పందించాడు.. అన్విత కోరుకున్నది జరిగిందా.. ఇద్దరి మధ్య బంధం చివరికి ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
కొన్నిసార్లు మంచి పాత్రలు కూడా సరైన నటుల చేతిలో పడకపోవడం వల్ల తేలిపోతుంటాయి. దాని వల్ల సినిమాలే చెడిపోతుంటాయి. అదే సమయంలో కొన్ని పాత్రలు కాస్త అటు ఇటుగా ఉన్నా సరే.. మంచి నటుల చేతిలో పడితే అవి ఎలివేట్ అవుతుంటాయి. ఇలాంటి పెర్ఫామెర్లకు కొంచెం కంటెంట్ ఉన్న క్యారెక్టర్.. మంచి ప్లాట్ పాయింట్ తోడైతే.. రఫ్ఫాడించేస్తారు. నవీన్ పొలిశెట్టి ఆ కోవకు చెందిన నటుడే. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న ఈ కుర్రాడికి చాన్నాళ్ల పాటు ప్రతిభకు తగ్గ అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చినపుడు అతనెలా చెలరేగిపోయాడో 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'.. 'జాతిరత్నాలు' సినిమాల్లో చూశాం. ఆ సినిమాల్లో నవీన్ చేసిన పాత్రల్లో వేరొకరిని ఊహించుకోలేం. వేరే వాళ్లు చేస్తే ఆ పాత్రలు.. ఆ సినిమాలు అంత ఎలివేట్ అయ్యేవా అన్నది కూడా సందేహమే. ఇప్పుడు 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాను కూడా సింపుల్ గా నవీన్ షోగా చెప్పొచ్చు. దర్శకుడు మహేష్ బాబు కామెడీకి మంచి స్కోప్ ఉన్న ఒక పాయింట్ చుట్టూ కథను రాసుకున్నాడు. మిగతా క్యారెక్టర్ల సంగతి పక్కన పెడితే.. నవీన్ పొలిశెట్టికి నప్పే పాత్రను క్రియేట్ చేసి.. దానికి కొన్ని మంచి డైలాగులు జోడించి తనకు అప్పగించేశాడు. ఇక అంతే.. నవీన్ చెలరేగిపోయాడు. వేరే ఆకర్షణలు కూడా కొన్ని ఉన్నా.. సినిమాను డ్రైవ్ చేసేది మాత్రం నవీనే. అతడికి కనెక్టయితే రెండున్నర గంటల పాటు హాయిగా గడిచిపోతాయంతే.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. బాలీవుడ్ మూవీ 'విక్కీ డోనర్'ను గుర్తు చేసే అడల్ట్ టచ్ ఉన్న కథ. ప్రేమ.. పెళ్లి మీద నమ్మకం లేని ఒక అమ్మాయి.. వీర్య దాత సాయంతో తల్లి కావాలనుకుంటుంది. అందుకోసం మామూలుగా అయితే మంచి జీన్స్ ఉన్న స్పెర్మ్ డోనర్ ను ఎంచుకుంటే సరిపోతుంది. కానీ శారీరకంగా బలంగా ఉంటే సరిపోదు.. గుణగణాలు కూడా బాగుండాలని ఆలోచిస్తూ అలాంటి ఒక వ్యక్తి కోసం సాగించే అన్వేషణ.. ఆ క్రమంలో తనకు పరిచయం అయ్యే ఒక స్టాండప్ కమెడియన్.. తనతో జర్నీ.. ఈ క్రమంలో సాగే కథ ఇది. తనకు వీర్యాన్ని దానం చేసే వ్యక్తితో ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ ఉండకూడదని అని కోరుకుంటూనే అతడి గుణగణాల్ని ఎంచి ఉత్తముడు అనుకున్నాక తన సాయంతో బిడ్డను కనడం ద్వారా.. అతడితో తెలియకుండానే తాను ఎమోషనల్ గా కనెక్ట్ కావడం.. దీని చుట్టూ సంఘర్షణను హృద్యంగా చూపించాడు దర్శకుడు. ఐతే డైరెక్టర్ పూర్తిగా హీరోయిన్ కోణంలోనే కథను మొదలుపెట్టి.. ఆమె కోణంలోనే దీన్ని ముగించినప్పటికీ.. మధ్యలో ఆ కథ మధ్యలో ఎంటర్ అయినప్పటికీ దాన్ని డ్రైవ్ చేేసేది మాత్రం హీరోనే. స్తబ్దుగా సాగే కథానాయిక జీవితంలోకి వెలుగులు తెచ్చినట్లే.. కొంచెం నెమ్మదిగా మొదలయ్యే సినిమాలోనూ హుషారు తెచ్చి ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తేది కూడా నవీనే.
విదేశాల్లో బాగా పాపులర్ అయి... ఇండియాలో కూడా వేరే భాషల్లో సక్సెస్ అయిన స్టాండప్ కామెడీ కాన్సెప్ట్ తెలుగులో అంతగా విజయవంతం కాలేదని అంటారు. హైదరాబాద్ సిటీలో షోలు నడుస్తున్నప్పటికీ అవి సామాన్య జనానికి అంత రీచ్ కాలేదన్నది వాస్తవం. ఎప్పుడైనా సినిమాల్లో స్టాండప్ కామెడీ కాన్సెప్ట్స్ చూసినా.. ఏముంది ఇందులో అని నిట్టూర్చేలా ఉంటాయి. కానీ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమాలో స్టాండప్ కామెడియన్ గా నవీన్ ని చూశామంటే మాత్రం ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోవడం ఖాయం. నిజంగా స్టాండప్ కామెడీలో ఇంత మజా ఉంటుందా అనిపించేలా ఆ పాత్రను అతను పండించాడు. మామూలు జోకుల్ని కూడా.. మంచి సిచువేషన్ క్రియేట్ చేసి.. సరైన టైమింగ్ తో చెప్పి.. ప్రేక్షకులను నవ్వించడమే స్టాండప్ కామెడీ. సినిమాలో అలాగే సన్నివేశాలను క్రియేట్ చేసి నవ్వించారు నవీన్-మహేష్. నవీన్ కథలోకి ఎంటరైన దగ్గర్నుంచి కామెడీ పంచులు పేలుతూనే ఉంటాయి. కథనం మంచి జోష్ తో సాగిపోతుంది. హీరోయిన్ ఉద్దేశం తెలియకుండా ఆమె తన పట్ల చూపించే ఆసక్తిని ప్రేమ అనుకుని హీరో గాల్లో తేలిపోతున్నంత వరకు సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. చివరికి అసలు విషయం తెలిసి డంగైపోయే దగ్గర ట్విస్ట్ కూడా బాగా డీల్ చేశాడు. ద్వితీయార్ధంలో వినోదం తగ్గి.. సీరియస్ గా కథను డీల్ చేసినప్పటి నుంచి 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' నెమ్మదిస్తుంది. మధ్య మధ్యలో నవీన్ ఎంటర్టైన్ చేసినా కూడా కథనంలో పెద్దగా కదలిక కనిపించదు. ఐతే చివర్లో ఎమోషనల్ టర్న్ తీసుకున్న సినిమా.. ప్రేక్షకులను కదిలిస్తుంది. ముగింపులో భావోద్వేగాలు సరిగా పండడంతో ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి వస్తాం. అడల్ట్ టచ్ ఉన్న పాయింట్.. అందుకు తగ్గట్లుగా సాగే కొన్ని సన్నివేశాల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడొచ్చు కానీ.. యూత్ కు అయితే 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' మంచి కిక్కిచ్చే సినిమానే.
నటీనటులు:
నవీన్ పొలిశెట్టిని చూస్తున్నంతసేపు ఇంత టాలెంట్ చాన్నాళ్ల పాటు వేస్ట్ అయిపోయిందే అన్న ఫీలింగ్ కలుగుతుంది. అతనొక లైవ్ వైర్ లాగా కనిపిస్తాడు. తెర మీద కనిపించే ప్రతి క్షణం ప్రేక్షకులను అలరిస్తాడు. సినిమాలో మామూలు డైలాగుల్ని కూడా పేలిపోయే పంచుల్లాగా.. ఆసక్తి రేకెత్తించని సీన్లను కూడా ఎంగేజింగ్ గా మార్చిన ఘనత అతడికే దక్కుతుంది. నవీన్ స్థానంలో మరో నటుడు ఉంటే.. ఈ సినిమా ఎంటర్టైనింగ్ గా అనిపించేదా అంటే సందేహమే. కొంచెం కూడా అసహజత్వం లేకుండా.. నిజంగా ఓ స్టాండప్ కమెడియన్ని.. ఒక సగటు కుర్రాడిని చూస్తున్న ఫీలింగ్ కలిగేలా తన పాత్రను అద్భుతంగా పోషించాడు నవీన్. అనుష్కను అతను బాగా డామినేట్ చేశాడు. అనుష్క నటన పాత్రకు తగ్గట్లుగా నటనలో అండర్ ప్లే చేస్తున్నట్లుగా సాగింది. ఏ ఫీలింగ్స్.. ఎమోషన్లు లేకుండా సాగిపోయే పాత్రకు అవసరమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో అనుష్క కనిపించింది. ఇది తన వయసుకు తగ్గ పాత్ర కూడా. కాకపోతే లుక్స్ పరంగా అనుష్క మెప్పించలేకపోయింది. ఏదో ఒక అసహజత్వం తన పాత్రను వెంటాడింది. తెర మీద ఆమె పక్కన కనిపించే క్యారెక్టర్లో ఉన్న సహజత్వం అనుష్కలో కనిపించకపోవడం వల్ల తేడా స్పష్టంగా తెలిసిపోయింది. క్యారెక్టర్ తాలూకు డల్ నెస్ కూడా అనుష్క అభిమానులను కొంత నిరాశ పరుస్తుంది. నాజర్.. మురళీ శర్మ.. తులసి.. జయసుధ.. వీళ్లందరి స్క్రీన్ టైం తక్కువైనప్పటికీ తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు. హీరో ఫ్రెండు పాత్రలో అభినవ్ గోమఠం.. హీరోయిన్ స్నేహితురాలిగా సోనియా బాగా చేశారు.
సాంకేతిక వర్గం:
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'కి సాంకేతిక హంగులు బాగానే కుదిరాయి. గోపీసుందర్ మంచి ఫీల్ తో సాగింది. రధన్ పాటల్లో చార్ట్ బస్టర్స్ లేవు కానీ.. చాలా వరకు కథనంలో ఇమిడిపోయి ఫ్లోలో సాగిపోయాయి. నీరవ్ షా కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. మహేష్ బాబు రచయితగా.. దర్శకుడిగా తన పనితనం చూపించాడు. ఇలాంటి సింపుల్ స్టోరీలను రెండున్నర గంటల పాటు బోర్ కొట్టించకుండా నడిపించడం అంత తేలిక కాదు. ఏదైనా వెరైటీ పాయింట్ మీద సినిమాలు చేసినపుడు చాలామంది 'ఐడియా'కు ఎగ్జైట్ అయిపోయి.. దాని వరకు కొన్ని మెరుపులు మెరిపించి.. తర్వాత చేతులెత్తేస్తుంటారు. కానీ మహేష్ మాత్రం.. ఆ పాయింట్ చుట్టూ ఆసక్తికర కథనాన్ని అల్లాడు. చాలా వరకు బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించాడు. కొన్ని చోట్ల రైటింగ్ బలహీనంగా కనిపించినా.. నవీన్ ను సరిగ్గా వాడుకుని గట్టెక్కేశాడు మహేష్.
చివరగా: మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. నవీన్ షో
రేటింగ్ - 3/5