టాలీవుడ్ పై మోహన్ లాల్ సంచలన వ్యాఖ్యలు
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎల్2: ఎంపురాన్.;
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఎల్2: ఎంపురాన్. ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. లూసిఫర్ సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో ఎల్2: ఎంపురాన్ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ ను నిర్వహించగా, అందులో హీరో మోహన్ లాల్ తో పాటూ డైరెక్టర్ పృథ్వీరాజ్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ లో మోహన్ లాల్ తెలుగు చిత్ర పరిశ్రమ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే బెస్ట్ ఇండస్ట్రీగా టాలీవుడ్ ను ఆయన అభివర్ణించారు.
తన 47 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది తెలుగు నటీనటులతో కలిసి పని చేశానని, తెలుగు ఆడియన్స్ గౌరవించే విధానం తనకెంతో బాగా నచ్చుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఏఎన్నార్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన మోహన్ లాల్, గతంలో తాను నటించిన మలయాళ సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయని, ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులోనే ఎల్2: ఎంపురాన్ ను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు.
ఈ సినిమాను అందరూ సీక్వెల్ అనుకుంటున్నారు కానీ ఇది సీక్వెల్ కాదని, అసలు కథ అనుకున్నప్పుడే దీన్ని మూడు పార్టులుగా తీయాలనుకున్నట్టు ఆయన తెలిపారు. ఎల్2 కోసం టీమ్ మొత్తం రెండేళ్ల పాటూ కష్టపడ్డామని చెప్పిన లాలెట్టన్, సినిమా 50 డేస్ ఫంక్షన్ ను కూడా హైదరాబాద్‌లోనే సెలబ్రేట్ చేసుకుంటానని ఎల్2 సక్సెస్‌పై నమ్మకం వ్యక్తం చేశారు.
మలయాళ సినిమా ఆడియన్స్ గురించి సందర్భమొచ్చినప్పుడల్లా గొప్పగా చెప్తూ మలయాళ సినీ పరిశ్రమను పొగిడే మోహన్ లాల్ ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను కూడా పొగడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే ఈ సూపర్ స్టార్ ఎల్2: ఎంపురాన్ కోసం కనీసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఈ సినిమాను చేసినట్టు ఆల్రెడీ డైరెక్టర్ పృథ్వీరాజ్ వెల్లడించిన విషయం తెలిసిందే.