పోలీసులను ఒప్పించలేక ఆగిపోయిన మెగా హీరో మూవీ

తాజాగా ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంపత్ నంది ‘గాంజా శంకర్’ గురించి నిజాలు బయటపెట్టారు.;

Update: 2025-03-23 07:06 GMT
పోలీసులను ఒప్పించలేక ఆగిపోయిన మెగా హీరో మూవీ

టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలనే ధైర్యం ఉన్న దర్శకుల్లో సంపత్ నంది ఒకరు. ఆయన కథల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సూటిగా చెప్పే విషయముంటుంది. ఇదే తరహాలో సాయిధరమ్ తేజ్ హీరోగా గాంజా శంకర్ అనే సినిమాను ఆయన గతంలో ప్రకటించారు. గ్లింప్స్‌ కూడా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ ప్రాజెక్ట్‌పై అనేక ఊహాగానాలు నడిచాయి. సినిమాకు సంబంధించి పూర్తి అప్‌డేట్ లేకపోవడంతో ఇది ఆగిపోయిందనే వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు ఈ ప్రచారాలపై దర్శకుడు స్పందించారు.

తాజాగా ఓదెల 2 ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న సంపత్ నంది ‘గాంజా శంకర్’ గురించి నిజాలు బయటపెట్టారు. ఈ సినిమా వాస్తవంగా నిలిపివేశామనే విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘‘సినిమా టైటిల్ ప్రకటించిన వెంటనే పోలీసుల నుంచి నోటీసులు వచ్చాయి. హీరోకు, నిర్మాతకు నాకు.. ముగ్గురికీ నోటీసులు అందాయి. ‘గాంజా’ అనే పదాన్ని టైటిల్‌లో వాడొద్దని చెప్పడమే కాదు, పేరే మార్చాలని కోరారు’’ అని తెలిపారు. అయితే టైటిల్ మార్చి కథను మార్చడం కంటే.. సినిమా ఆపేయడమే బెటర్ అని అనుకున్నట్లు చెప్పారు.

‘‘మనమే కథ రాస్తాం.. అందులో కంటెంట్ ఏంటో తెలుసుకున్నవాళ్లం మేమే. ఈ కథలో గాంజాకు వ్యతిరేకంగా చెప్పాలనుకున్నా. కానీ అది పోలీసులకు వివరించడానికి వెళ్లడం కరెక్ట్ కాదనిపించింది. కచ్చితంగా మంచి సినిమా చేయాలనుకునే మనిషిగా.. ఇలా ఎవరోని ఒప్పించడం కంటే, నన్నే నేను ఒప్పించుకుని వెనక్కి తగ్గడమే మంచిదనిపించింది. అందుకే గాంజా శంకర్‌ను ఆపేశాం. కానీ శంకరుడు మీదే మంచి కథ రాసి, ఇప్పుడు ‘ఓదెల 2’ చేస్తున్నాను’’ అంటూ సంపత్ నంది స్పష్టంగా తెలిపారు.

ఇక గాంజా శంకర్ ఆగిపోవడంతో, సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. మరోవైపు సంపత్ నంది శర్వానంద్‌తో ఓ పీరియాడికల్ యాక్షన్ మూవీలో బిజీ అయ్యారు. ఈ సినిమా ఏప్రిల్‌లో రెగ్యులర్ షూటింగ్‌ మొదలుకానుంది. అంతేకాకుండా, తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఓదెల 2కి కథ, స్క్రీన్‌ప్లే అందించి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఏప్రిల్ 17న విడుదల కానున్న ‘ఓదెల 2’ ఒక డివోషనల్ థ్రిల్లర్. ఇందులో తమన్నా నాగసాధ్విగా నటిస్తున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట సింహా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడిగా, నిర్మాతగా సంపత్ నంది ఎప్పటికప్పుడు బిజిగానే ఉంటున్నాడు. కెరీర్ మొదట్లో రెండవ అవకాశంగా రామ్ చరణ్ తో రచ్చ అనే సినిమా చేసే అవకాశం దక్కింది. కానీ ఆ తరువాత మళ్ళీ అతను బిగ్ స్టార్ తో సినిమా చేయలేదు. ఇక శర్వా సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News