'దేవర' జపాన్ ప్రచారం.. భార్యతో కలిసి తారక్!
ఈ నేపథ్యంలో నేడు ఎన్టీఆర్ సతీసమేతంగా జపాన్ బయల్దేరారు. ఉదయమే బెంగుళూరు విమానాశ్రయం నుంచి జపాన్ ప్లైట్ ఎక్కారు.;
యంగ్ టైగర్ ఎన్టీఆర్ జపాన్ ఎప్పుడొస్తారా? అని అక్కడి అభిమానులు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. 'దేవర' మొదటి భాగం మార్చి 28న జపాన్ లో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా జపాన్ వెళ్తున్నట్లు విషయం బయటకు వచ్చిన నాటి నుంచి జపాన్ అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతుంది. ఆయన రాక కోసం కొన్ని రోజులుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు.
ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడాలని..ఫోటోలు దిగాలని...సెల్పీలు దిగాలని ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఎన్టీఆర్ సతీసమేతంగా జపాన్ బయల్దేరారు. ఉదయమే బెంగుళూరు విమానాశ్రయం నుంచి జపాన్ ప్లైట్ ఎక్కారు. సతీమణితో తారక్ జపాన్ వెళ్లడం ఇది రెండవ సారి. తొలిసారి 'ఆర్ ఆర్ ఆర్' ప్రచారంలో భాగంగా అప్పుడు కూడా ప్రణతీతో కలిసి వెళ్లారు.
రామ్ చరణ్- ఉపాసన, రాజమౌళి-రమా ఇలా జోడీలన్ని కలిసి వెళ్లి జపాన్ విను వీధుల్లో ఆర్ ఆర్ ఆర్ ని ప్రచారం చేసారు. ఆ తర్వాత మళ్లీ తారక్ మళ్లీ జపాన్ వెళ్లలేదు. షూటింగ్ కోసం....కొన్ని వేడుకల కోసం ఇతర దేశాలకు వెళ్లినప్పుడు అక్కడ జపాన్ అభిమానులు మళ్లీ తమ దేశం ఎప్పుడు వస్తున్నారని అడిగారు. త్వరగా రావాలని ఆతిద్యం కూడా ఏర్పాటు చేస్తామని పిలుపు చేసారు.
'దేవర' రూపంలో మళ్లీ జపాన్ వెళ్లే అవకాశం దక్కింది కాబట్టి అక్కడ అభిమానులందర్నీ తారక్ పలక రిస్తాడు. వాళ్లతో మాట మంతి చేసి సోదర భావాన్ని పంచుతాడు. అభిమానులంటే తారక్ ప్రాణం పెడతాడని చెప్పాల్సిన పనిలేదు. తన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లకు అభిమానులు వచ్చిన సమయంలో ఎంతో జాగ్రత్తగా తిరిగి ఇంటికి చేరుకోవాలని ప్రతీ వేదికపైనా చెబుతుంటారు.