పుష్ప 3.. అట్లీ కాంబో.. హింట్ ఇచ్చిన మైత్రి నిర్మాత!
ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రి నిర్మాత నవీన్ ఎంతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.;
ఈ మధ్యకాలంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ తెలుగు పరిశ్రమలో ఊపు మీదుంది. ఒకవైపు స్టార్ హీరోలతో పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తూనే, మరోవైపు బాలీవుడ్ రంగంలోకి ప్రవేశించి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నది. తాజాగా సన్నీ డియోల్ 'జాట్' సినిమాను పీపుల్ మీడియాతో కలిసి నిర్మిస్తున్న మైత్రి, ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రి నిర్మాత నవీన్ ఎంతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం అందరిలో హాట్ టాపిక్ అయిన పుష్ప 3 గురించి అడిగిన ప్రశ్నకు నవీన్ సూటిగా స్పందించారు. "పుష్ప 3 సినిమా ఉంటుందా?" అనే డౌట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో.. “అవును, పుష్ప 3 సినిమా ఖచ్చితంగా ఉంటుంది. కానీ అది 2027లో ప్రారంభమవుతుంది. అప్పటికి సుకుమార్ – రామ్ చరణ్ సినిమా RC17 పూర్తవుతుంది. ఆ తర్వాతే పుష్ప 3 సెట్స్ పైకి వెళ్తుంది,” అంటూ క్లారిటీ ఇచ్చారు.
అలాగే మరో ఆసక్తికరమైన కాంబినేషన్ అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ గురించి కూడా స్పందించారు. ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. “అట్లీ – బన్నీ సినిమా ఎప్పుడు ఉంటుంది?” అని అడిగిన ఓ మీడియా ప్రతినిధికి నవీన్.. “ఆ ప్రాజెక్ట్‌ను మేము నిర్మించడం లేదు. కానీ త్వరలోనే అది మొదలవుతుంది. ఇప్పుడే అధికారికంగా చెప్పలేను కానీ, హడావుడి మొదలవుతుంది” అంటూ పరోక్షంగా హింట్ ఇచ్చారు.
ఇప్పటికే అందిన సమాచారం ప్రకారం.. అట్లీ దర్శకత్వంలో రూపొందబోయే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తమిళ స్టార్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తీసుకోనుందని తెలుస్తోంది. అంతేకాదు, అల్లు అర్జున్ సొంత సంస్థ అయిన గీతా ఆర్ట్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అట్లీ – విజయ్ కాంబోలో వచ్చిన సినిమాల మాదిరిగానే, బన్నీతో కూడా ఓ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఉండబోతుందని తెలుస్తోంది.
ఇది అఫిషియల్ కాదు కానీ.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు, క్యాస్టింగ్ చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. మరోవైపు, అల్లు అర్జున్ ఇప్పుడే పుష్ప 2 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. వెంటనే త్రివిక్రమ్ తో ఒక ప్రాజెక్టు అనుకున్నప్పటికి మధ్యలో అట్లే దిగిపోయాడు. ఇక మైత్రి నిర్మాత నవీన్ ఇచ్చిన ఈ హింట్‌తో అభిమానుల్లో హైప్ రెట్టింపైంది. మరి ఆ హైప్‌కు తగ్గట్టుగా అట్లీ – బన్నీ సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్‌మెంట్ వస్తుందో చూడాలి.