మోక్షజ్ఞ డెబ్యూ.. మరో ఇంట్రెస్టింగ్ లీక్

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది.

Update: 2024-10-16 05:13 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ ముందుకు సాగుతోంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలుగా వచ్చి సత్తా చాటుతుండడమే. ఇప్పుడు ఇదే క్రమంలో మరో నందమూరి వారసుడు కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అతడే.. నటసింహా నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ.

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి చాలా రకాల వార్తలు వచ్చాయి. అందులోనూ అతడి మొదటి చిత్రం ఏ దర్శకుడితో ఉంటుంది అన్న దానిపై కూడా చాలా ప్రచారాలు జరిగాయి. ఈ పరిస్థితుల్లోనే నందమూరి మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవలే వచ్చింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నందమూరి తేజస్విని సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉండడంతో పాటు కాస్టింగ్ మీద కూడా ఫోకస్ చేస్తున్నాడు.

నందమూరి మోక్షజ్ఞ - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో పేరున్న పెద్ద పెద్ద నటీనటులు భాగం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ చిత్రంలో మోక్షజ్ఞకు తల్లిగా నటించబోయేది ఎవరన్న దానిపై ఓ సమాచారం లీక్ అయింది. దీని ప్రకారం.. ఇందులో హీరో మదర్‌గా సీనియర్ హీరోయిన్ శోభన నటిస్తున్నట్లు తెలిసింది.

1980వ దశకంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శోభన తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించారు. అయితే, చాలా కాలం పాటు కనుమరుగు అయిపోయిన ఆమె ఇటీవలే విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకున్నారు. అప్పటి నుంచి ఆమెకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు శోభనకు మోక్షజ్ఞ తల్లిగా నటించే అవకాశం లభించినట్లు తెలిసింది. దీంతో ఆమె వెంటనే ఇందులో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గతంలో శోభన.. బాలయ్యతో ‘నారి నారి నడుమ మురారి’, ‘మువ్వ గోపాలుడు’ వంటి మూవీల్లో మెప్పించారు.

మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే దీని నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చింది. దీనికి నందమూరి అభిమానులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి స్పందన భారీగా లభించిన విషయం తెలిసిందే. ఫలితంగా ఈ చిత్రంపై హైప్ పెరుగుతూనే ఉంటోంది.

Tags:    

Similar News