MAA తరహాలో TMTAU ఎన్నికల వివాదం
ఈ ఎన్నికల్లో ఒక ప్యానెల్ తరపున అధ్యక్షునిగా 30 ఇయర్స్ పృథ్వీ పటీపడుతుండగా, అపోజిషన్ తరపు నుంచి మన ప్యానెల్ పోటీకి దిగుతోంది
మూవీ ఆర్టిస్టులకు ఎన్నికలు అంటే ఎంత హడావుడి ఉంటుందో తెలిసిందే. మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల వేళ జనరల్ ఎలక్షన్స్ లో ఉన్నంత గలాటా ఉంటుంది. ప్రత్యర్థుల మధ్య కుట్రలు కుతంత్రాలు కూడా చూస్తుంటాం. ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ నిధులు పక్కదోవ పట్టాయనో, సంక్షేమ కార్యక్రమాలు సరిగా చేయలేదనో ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటారు.
ఇప్పుడు అదే తీరుగా ఫిబ్రవరి 11న జరగబోయే తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఇరు ప్యానెళ్ల మధ్యా వార్ నటీనటుల్లో చర్చగా మారింది. ఇప్పటికే ఈ యూనియన్ లో మూవీ ఆర్టిస్టుల సంఘాన్ని మించి సభ్యులు ఉన్నారు. మొత్తం 1230 మందికి ఎలక్షన్స్ జరుగుతుండగా ఈసారి ఎన్నికలు రసపట్టులో సాగనున్నాయని తాజా వివాదాలు నిరూపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో ఒక ప్యానెల్ తరపున అధ్యక్షునిగా 30 ఇయర్స్ పృథ్వీ పటీపడుతుండగా, అపోజిషన్ తరపు నుంచి మన ప్యానెల్ పోటీకి దిగుతోంది. అయితే పృథ్వీరాజ్ కి ఉన్న ఫాలోయింగ్ తో ఈ ప్యానెల్ ఎన్నికల పోటీలో ముందంజలో ఉందని తెలుస్తోంది.
ఇదే సమయంలో గత పాలకులను నిలదీస్తున్న వారికి కొదవేమీ లేదు. గత కమిటీ వల్ల అవకతవకలు జరిగాయని మొత్తం 1230 మందిని పిలిచి మీటింగ్ పెట్టి అందరి ముందు లెక్కలు తేల్చండి అంటూ ఆర్టిస్టుల మధ్య రసాభాస మొదలైంది. ఇంతకుముందు 'మా' అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగిన శివాజీ రాజాపైనా ప్రతిపక్ష వీకే నరేష్ అవినీతి ఆరోపణలు చేసారు. అదే తీరుగా ఇప్పుడు నంబర్ 2 అసోసియేషన్ గా ఉన్న తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల సంఘంలోను లుకలుకలు బయటపడుతున్నాయి.