మ్యూజిక్ షాప్ మూర్తి ట్రైలర్.. కాలంతో పాటు మనమూ మారాలి!
తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ దక్కుతుందని ఇప్పటికే అనేక చిత్రాలు నిరూపించిన విషయం తెలిసిందే
తెలుగులో కంటెంట్ ఉన్న సినిమాలకు ఎప్పుడూ ఆదరణ దక్కుతుందని ఇప్పటికే అనేక చిత్రాలు నిరూపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో కంటెంట్ ను నమ్ముకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. ఇండస్ట్రీలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అజయ్ ఘోష్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. తెలుగమ్మాయి చాందిని చౌదరి ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తోంది.
శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 14వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఏంటీ ఇంకా డీజే రాలేదనే డైలాగ్ తో ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది.
గ్రామంలో మ్యూజిక్ సీడీల షాప్ నిర్వహించే మిడిల్ క్లాస్ వ్యక్తి అజయ్ ఘోష్ కలెక్షన్ కు మంచి ఫ్యాన్స్ ఉంటారు. కానీ షాప్ ద్వారా వచ్చే ఆదాయం మాత్రం సరిపోదు. దీంతో తనకు నచ్చిన మ్యూజిక్ తో ఏదైనా చేయాలనుకుంటారు. ఆ తర్వాత డీజే నేర్చుకుంటారు. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడతారు. కుటుంబ సభ్యులు కూడా వ్యతిరేకిస్తారు. దీంతో డీజే అవ్వాలని హైదరాబాద్ కు వచ్చి అనేక కష్టాలు ఎదుర్కొంటారు.
అదే సమయంలో అతడికి చాందిని పరిచయమవుతుంది. అసలు వారిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? చాందిని అతడికి ఎలా సపోర్ట్ చేసింది? వారి ప్రయాణం ఎలా సాగింది? డీజే ఎలా అయ్యారు? అనే అంశాల చుట్టూ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు అర్థమవుతోంది. అజయ్ ఘోష్ భార్యగా ఆమని కనిపించనుంది. కాలంతో పాటు మనం కూడా మారాలని ఆమె చెప్పిన డైలాగ్ మనసుకు హత్తుకుంటుంది.
మొత్తానికి ట్రైలర్ బాగుంది. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. వినోదం, భావోద్వేగాలు, డ్రామాతో పాటు అన్ని రకాల అంశాలు ఉన్న కథను డైరెక్టర్ శివ పాలడుగు ఎంచుకున్నారు. స్టోరీ అంతా ఎక్కడా బోరింగ్ లేకుండా ఆకర్షణీయంగా ఉండేలా చూసుకున్నారు. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అజయ్ ఘోష్ అసాధారణమైన నటనతో అలరించారు. ఎమోషనల్ క్యారెక్టర్ లో ఆయనను చూడడం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.
ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమాలో సీనియర్ నటి ఆమనితో పాటు అమిత్ శర్మ, భానుచందర్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవన్ సంగీతాన్ని అందిస్తున్నారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.