హనుమాన్ కు అపార నష్టం... వారికి నిర్మాతల మండలి షాక్
హనుమాన్ మూవీ నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది
ఇప్పుడు ఎక్కడ చూసినా హనుమాన్ సినిమా గురించే చర్చ నడుస్తోంది. తేజ సజ్జ హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం (జనవరి 12) థియేటర్లలో రిలీజ్ అయింది. అంతకు ముందు రోజే పెయిడ్ ప్రీమియర్ షోలు పడగా.. అద్భుతమైన టాక్ బయటకు వచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. అయితే నైజాం (తెలంగాణ)లో హనుమాన్ మూవీకి థియేటర్ల విషయంలో వివాదం కొనసాగుతోంది.
హనుమాన్ మూవీ నైజాం థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దక్కించుకుంది. అయితే తాము హనుమాన్ కోసం ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న కొన్ని థియేటర్లు.. దాన్ని ఉల్లంఘించి తమ చిత్రాన్ని ప్రదర్శించడం లేదని మైత్రీ మూవీ మేకర్స్ అంటోంది. ఈ విషయంలో హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి, మైత్రీ వారు.. నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు.
అయితే హనుమాన్ విషయంలో అగ్రిమెంట్లను థియేటర్లు ఉల్లంఘించడం సరికాదని నిర్మాతల మండలి సీరియర్ అయింది. థియేటర్ల తీరు వల్ల డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు నష్టం వాటిల్లుతోందని పేర్కొంది. దీంతో ఆ థియేటర్లు వెంటనే హనుమాన్ సినిమా ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టాన్ని భరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది.
''మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్.. హనుమాన్ సినిమా ప్రదర్శన కోసం జనవరి 12 నుంచి తెలంగాణలో కొన్ని థియేటర్లతో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ, సదరు థియేటర్ల వారు అగ్రిమెంట్ బేఖాతరు చేస్తూ నైజాం ఏరియాలో సినిమాను ప్రదర్శించలేదు. ఆ విషయమై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. థియేటర్ల అగ్రిమెంట్ ప్రకారం హనుమాన్ సినిమా ప్రదర్శన చేయకపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది. కాబట్టి ఆ థియేటర్లు వెంటనే హనుమాన్ ప్రదర్శనను ప్రారంభించాలి. ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి.
థియేటర్ల యాజమాన్యాలు ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తోంది. న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఎగ్జిబిటర్లు.. ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తూ హనుమాన్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు సత్వర న్యాయం చేయాలి'' అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి పేర్కొంది.
హనుమాన్ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో నైజాంలో రెండో రోజు థియేటర్లు సరిపోని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో థియేటర్లు ఫుల్ అయ్యాయి. దీంతో నైజాంలో హనుమాన్ కు థియేటర్లు పెంచాలంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ థియేటర్ల వివాదంలో ఏం జరుగుతుందో చూడాలి.